అమెరికా కుతంత్రాన్ని బయటపెట్టిన రష్యా
నిషేధిత క్షిపణులను ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మోహరించాలన్న అమెరికా కుతంత్రాన్ని రష్యా బయటపెట్టింది. ఇప్పటికే ఆ క్షిపణుల మోహరింపు ప్రక్రియను అమెరికా ప్రారంభించిందని తెలిపింది. కొత్త ప్రదేశాల్లో తన క్షిపణులను అమర్చుకునేందుకే మధ్యంతర శ్రేణి అణు క్షిపణుల ఒప్పందం (ఐఎన్ఎఫ్) నుండి అమెరికా వైదొలగిందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావోరోవ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారంపై జరిగిన రాయబారుల రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 500 నుండి 5500 కిలోమీటర్ల పరిధిలో ఉపయోగించగల అణు, సాంప్రదాయ క్షిపణుల్లో చాలా రకాలను రష్యా, అమెరికాలు కలిగి వుండకుండా 1987 నాటి ఐఎన్ఎఫ్ ఒప్పందం నిషేధించింది. 2019లో అమెరికా దీన్నుండి బయటకు వచ్చేసింది. పైగా రష్యా ఈ ఒప్పందాన్ని అమలు చేయడం లేదంటూ నిందలు వేసింది. ఇప్పటికే ఫిలిప్పైన్స్‌లో అమెరికా ఈ తరహా క్షిపణులను మోహరించిందని రష్యా విదేశాంగ మంత్రి తెలిపారు.






