Russia : మా దేశానికి తక్షణ ముప్పు రష్యా నుంచే
బ్రిటన్ ప్రభుత్వం తమ దేశ వ్యూహాత్మక రక్షణ సమీక్షను ప్రకటించనుంది. ప్రస్తుతం యూకే నూతన యుగంలోకి ప్రవేశిస్తోందని, ప్రపంచ దేశాల నుంచి బ్రిటన్కు భారీ ముప్పు పొంచి ఉందని అందులో హెచ్చరించింది. సమీక్షలో రష్యా (Russia )ను తమ దేశానికి తక్షణ ముప్పుగా అభివర్ణించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా చేస్తున్న సైబర్ దాడులు, రహస్య కార్యకలాపాలను పరీక్షించిన తర్వాత రష్యాను తమకు తీవ్రమైన ముప్పుగా పరిగణించినట్లు తెలిపాయి. యూకే, యూరప్ రెండిరటికీ రష్యా ప్రత్యక్ష ముప్పు ఎలా కలిగిస్తుందో ఈ నివేదికలో వివరించినట్లు వెల్లడిరచాయి.
చైనా (China )ను అధునాతన, నిరంతర సవాళ్లను సృష్టించే దేశంగా ఈ నివేదికలో అధికారులు అభివర్ణించారు. ప్రపంచంపై పెరుగుతున్న చైనా ప్రభావం, రష్యాతో దాని సహకారం వల్ల ఆ దేశాన్ని నిరంతరం సవాళ్లు సృస్టించే దేశంగా నివేదిక పేర్కొంది. 130 పేజీల ఈ రక్షణ నివేదికను యూకే ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) సలహాదారులు తయారు చేశారు. యూకే మాజీ లేబర్ డిఫెన్స్ సెక్రటరీ, నాటో సెక్రటరీ జనరల్ లార్డ్ రాబర్ట్సన్ (Lord Robertson ) దీనిని నేతృత్వం వహించారు. ప్రపంచ దేశాల నుంచి తమకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దేశంలో సైనిక దళాలు, అత్యాధునిక క్షిపణులు, ఆయుధాల తయారీ పెంచాల్సిన అవసరాన్ని సమీక్షిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.







