Islamabad: పాక్ నోట శాంతి ప్రవచనాలు.. సిందూర్ ఎఫెక్ట్ బాగానే పనిచేసింది మరి..!

దెబ్బగట్టిగా తగిలితేనే తత్వం బోధపడుతుంది.. అన్న మాట పాకిస్తాన్ (Pakistan) విషయంలో మరోసారి రుజువైంది. దశాబ్దాలు భారత్ శాంతిమంత్రాన్ని జపిస్తూ.. అభివృద్ధి దిశగా సాగుదామని పిలుపునిస్తే.. దాయాది పాకిస్తాన్ మాత్రం తీవ్రమైన వైరంతో బదులిచ్చేది. భారత్ శాంతి సందేశం వినిపిస్తే.. సరిహద్దుల్లో పాక్ ఉగ్రదాడులను ప్రోత్సహిస్తూ వచ్చేది. దీంతో ఇరుదేశాల మధ్య వైషమ్యాలు ముదిరిపోయాయి. కానీ.. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తర్వాత మాత్రం పరిస్థితుల్లో చాలా తేడా కనిపిస్తోంది.
భారత్-పాక్‌లు చర్చలకు కూర్చొని జమ్మూ-కశ్మీర్ సహా అన్ని అపరిష్కృత అంశాలను పరిష్కరించుకోవాలని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదించారు. తమ సైనికులకు కృతజ్ఞతలు తెలిపేందుకు పాటించిన ‘యోమ్-ఏ-తశక్కర్’ ముగింపు సందర్భంగా ఇస్లామాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘భారత్-పాకిస్థాన్ ఇప్పటివరకు మూడు యుద్ధాలు చేశాయి. కానీ ఏమీ సాధించలేకపోయాయి. ప్రశాంతంగా చర్చలకు కూర్చొని అన్నింటినీ పరిష్కరించుకోవాలని ఈ పాఠం మనకు చెబుతోంది. ముందు శాంతి నెలకొంటే అప్పుడు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలోనూ సహకరించుకోవచ్చు’’ అని చెప్పారు.
కృతజ్ఞతా దినం సందర్భంగా ఇస్లామాబాద్‌లో 31 సార్లు, ప్రావిన్సుల రాజధానుల్లో 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి సెల్యూట్ చేశారు. ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలతో సైనికదళాలకు సంఘీభావం ప్రకటించారు. తమది శాంతికాముక దేశమైనా స్వీయరక్షణకు తగినట్లు స్పందించే హక్కు ఉందని షెహబాజ్ అన్నారు. ‘‘భారత్‌కు దీటుగా జవాబిచ్చి’’ పాక్ సైనిక చరిత్రలో స్వర్ణాధ్యాయాన్ని లిఖించారని కొనియాడారు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య అపరిష్కృత, వివాదాస్పద అంశాలపై సమగ్ర చర్చలు జరుపుదామని పాక్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇశాక్ డార్ ప్రతిపాదించారు.
మొన్నటి సిందూర్ ఎఫెక్ట్ తో పాక్ రక్షణ పాటవం బాగా దెబ్బతింది. అది ఎంతలా అంటే.. పొరుగున ఉన్న రాష్ట్రం బలూచిస్తాన్ కాస్తా.. ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నా ఏమీ చేయలేని స్థితికి చేరింది. ఈపరిస్థితుల్లో భారత్ ను కవ్విస్తే , ఎలా ఉంటుందన్నది ఇప్పటికే బాగా అర్థమైంది పాకిస్తాన్ కు. అందుకే ముందుగా శాంతి ప్రస్తావన అంటూ ప్రాధేయపడుతోంది. అయితే అందులో మళ్లీ యధాలాపంగా కశ్మీర్ అంశంపై చర్చించాలని ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పుడు ఇలాంటి వాటికి భారత్ స్పందించే పరిస్థితి ఉండదని చెప్పొచ్చు.