Whitehouse: అమెరికా-పాక్ వాణిజ్యబంధం.. భారత్ కు ఇబ్బందేనా…?

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ (Pakistan) విదేశాంగ విధానం ఒక్కసారిగా మారిపోయింది. మారిన కాలమాన పరిస్థితుల్లో అమెరికాతో అనుబంధం ఎంత అవసరమో పొరుగుదేశం గుర్తించింది. దీనిలో భాగంగా ఇప్పటికే పలుమార్లు అమెరికాలో పర్యటించిన పాక్ ఆర్మీచీఫ్.. ఆసిం మునీర్.. ట్రంప్ తో పలుసందర్భాల్లో భేటీ అయ్యారు. ట్రంప్ (Trump) నాయకత్వాన్ని బహిరంగంగా ప్రశంసించారు. ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ మద్దతు ప్రకటించారు కూడా.
సుమారు ఆరేళ్ల తర్వాత పాక్ ప్రధాని ఒకరు.. అగ్రరాజ్యంలో పర్యటిస్తున్నారు. అమెరికాలో పర్యటించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. అగ్రరాజ్యంతో వ్యాపార సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.తమ దేశానికి భద్రత, నిఘా రంగాల్లో సహకారం అందించాలని అమెరికాకు పాకిస్థాన్ ప్రధాని విజ్ఞప్తి చేశారు. అలాగే తమ దేశంలోని వ్యవసాయం, ఐటీ, గనులు, ఖనిజాలు, ఇంధనం వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆ దేశ సంస్థలనూ అభ్యర్థించారు.. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అక్కడి కంపెనీలను కోరారు.
వైట్‌హాస్‌లోని ఓవల్ కార్యాలయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గురువారం ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద నిరోధక సహకారం తదితర అంశాలపై వారు చర్చలు జరిపారు. త్వరలోనే పాకిస్థాన్‌లో పర్యటించాలని ట్రంప్‌ను ప్రధాని షరీఫ్ ఆహ్వానించినట్లు పాకిస్థాన్ తెలిపింది. ఈ మేరకు పాక్ ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. గడచిన ఆరేళ్లలో శ్వేతసౌధాన్ని సందర్శించిన తొలి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కావడం గమనార్హం.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశాల్లో భాగంగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైట్‌హాస్‌ను మొదటిసారిగా సందర్శించారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.52 గంటలకు షరీఫ్ బృందం శ్వేతసౌధానికి చేరుకుంది. ఆ సమయంలో ట్రంప్ మీడియా సమావేశంలో ఉండడం వల్ల దాదాపు గంట పాటు అమెరికా అధ్యక్షుడి కోసం పాక్ నేతలు వేచి చూడాల్సి వచ్చింది. అనంతరం ఓవల్ కార్యాలయానికి చేరుకున్న ట్రంప్.. షరీఫ్‌తో భేటీ అయ్యారు. ఇది దాదాపు 80 నిమిషాల పాటు సాగింది. వాస్తవానికి ఈ భేటీ నుంచి పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ను తప్పించారు. ఆయన స్థానంలో ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ వచ్చారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా పాల్గొన్నారు. అంతకుముందు మీడియా సమావేశంలో పాల్గొన్న ట్రంప్ పాక్ ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఒక గొప్పనేత, గొప్ప వ్యక్తి అని కొనియాడారు.