Sunita Williams: సునీతా విలియమ్స్‌కు లేఖ రాసిన ప్రధాని మోదీ
భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) ఎట్టకేలకు భూమికి తిరిగి వస్తున్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆమెకు లేఖ రాశారు. ‘‘భారత్‌లో మిమ్మల్ని కలవడం కోసం ఎదురుచూస్తున్నాం,’’ అని ఆ లేఖలో మోదీ పేర్కొన్నారు. సునీతా (Sunita Williams) భద్రంగా భూమికి చేరుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు మోదీ తన లేఖలో రాసుకొచ్చారు. ‘‘యూఎస్ పర్యటనలో మీ గురించి అడిగి తెలుసుకున్నాను. మీరు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, మా హృదయాలకు ఎంతో దగ్గరగా ఉన్నారు. మీ అంతరిక్షయాత్ర విజయవంతం కావాలని మేమంతా ఆకాంక్షిస్తున్నాం. తిరిగి వచ్చిన తర్వాత మిమ్మల్ని భారత్‌లో కలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. మీలాంటి ధైర్యశాలి కుమార్తెలకు ఆతిథ్యం ఇవ్వడం భారత్‌కు గౌరవంగా ఉంటుంది,’’ అంటూ మోదీ (PM Modi) రాసిన లేఖను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
2024 జూన్ 5న నాసా ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో సునీతా విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్మోర్ కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) చేరుకున్నారు. వాస్తవానికి వారిద్దరూ వారం రోజుల్లో భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే, వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి ప్రయాణం ఆలస్యమైంది. చివరికి స్టార్‌లైనర్ వ్యోమనౌక ఆస్ట్రోనాట్లు లేకుండానే భూమికి తిరిగొచ్చింది. అయితే సునీతా, విల్మోర్లు ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు. బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు (భారత కాలమానం ప్రకారం) సునీతా (Sunita Williams) భూమిని చేరుకోనున్నారని నాసా వెల్లడించింది.






