Balochistan: బలూచిస్తాన్ పై నిర్భంద అణచివేత చట్టం.. పాక్ మరో వివాదాస్పద నిర్ణయం

బలూచిస్తాన్ వేర్పాటు ఉద్యమం అణచివేతకు పాక్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఓ నిర్భంద చట్టాన్ని తీసుకొచ్చింది పాక్ సర్కార్. బలోచిస్థాన్ అసెంబ్లీ ఆమోదం తెలిపిన ఉగ్రవాద వ్యతిరేక (సవరణ) చట్టం 2025పై స్థానిక పౌరులతో పాటు మానవహక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
బలోచ్ (Balochistan) పౌరులే లక్ష్యంగా తీసుకువచ్చిన ఈ చట్టం ప్రకారం.. ఎటువంటి ఆరోపణలు, కేసులు లేకున్నా అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచకుండానే 90 రోజుల వరకు నిర్బంధించే అధికారం పాక్ సైన్యం లేదా నిఘా సంస్థలకు ఉంటుంది. కోర్టుల నుంచి ముందస్తు అనుమతులు లేకున్నా సోదాల నిర్వహణ, స్వాధీనం, నిర్బంధించేందుకు అవసరమైన ఆదేశాలను ఇచ్చేందుకు పోలీసులు, నిఘా సంస్థలతో కూడిన సంయుక్త దర్యాప్తు సంస్థలకు (JIT) అధికారం కల్పించారు. కేవలం ‘అనుమానాస్పదం’ ఆధారంగానే అరెస్టులు చేసే వీలు కల్పించడంపై పౌర సమాజం నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తోంది.
ఈ చట్టం ద్వారా పౌరులకు న్యాయరక్షణ లేకుండా పోతుందని, గతంలో నీడచాటున జరిగే ఇటువంటి చర్యలను ప్రస్తుతం చట్టబద్ధం చేశారని న్యాయనిపుణులు, మానవ హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ చర్యలు అంతర్జాతీయ చట్టాలతో పాటు పాక్ రాజ్యాంగ రక్షణను ఉల్లంఘించడమేనని స్థానిక మానవ హక్కుల సంఘం హెచ్‌ఆర్‌సీపీతోపాటు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్‌రైట్స్ వాచ్, ఐసీసీపీఆర్ వంటి అంతర్జాతీయ హక్కుల సంఘాలు పేర్కొన్నాయి.
నిర్బంధాలు, అదృశ్య ఘటనలు అనేవి బలోచిస్థాన్‌ను ఏళ్లుగా వెంటాడుతున్నాయి. కనిపించకుండా పోయిన తమవారి కోసం అనేక కుటుంబాలు ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నాయి. అయితే, ఈ అదృశ్య ఘటనల వెనక ప్రభుత్వమే ఉందనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావడం బలోచ్ పౌరుల్లో మరింత భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఈ పరిణామాలపై మానవ హక్కుల సంస్థ బలోచ్ యక్తేజీ కమిటీ (బీవైసీ) స్పందిస్తూ.. ఈ చట్టంలోని నిబంధనలు వ్యక్తిగత స్వేచ్ఛ, ఏకపక్ష నిర్బంధం నుంచి రక్షణను ఉల్లంఘిస్తోందని మండిపడింది.