Operation Sindoor: ముందు బుకాయింపు.. తర్వాత ఒప్పుకోలు.. ఇలా తయ్యారేంట్రా బాబు..!

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత పాకిస్తాన్ పూర్తిగా ఒంటరైనట్లు కనిపిస్తోంది. చైనా,తుర్కియే తప్ప వేరేదేశం పాక్ ను నమ్మడం లేదు. దీనికి తోడు వారి వాచాలత్వం.. మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాక్ నేతలు ఇష్టానుసారం మాట్లాడారు. అస్సలు తమ రక్షణ వ్యవస్థలపై దాడి జరగలేదన్నారు. తర్వాత వివిధ దేశాల శాటిలైట్ చిత్రాలు, మీడియా పరిశోధన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో నోరు విప్పి మాట్లాడుతున్నారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’తో దాయాది పాకిస్థాన్ వణికిపోయింది. మన మిలిటరీ దాడులు ఆ దేశ వైమానిక దళాన్ని చావుదెబ్బ కొట్టాయి. శత్రువుల కీలక వైమానిక స్థావరాలను మన క్షిపణులు ధ్వంసం చేశాయి. అయితే, ఈ నష్టంపై ఇన్నాళ్లూ బుకాయిస్తూ వస్తోన్న పాక్ (Pakistan).. తాజాగా దాన్ని అంగీకరించింది. భారత క్షిపణుల దెబ్బ తమకు తగిలిందని స్వయంగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) ధ్రువీకరించారు.
‘‘మే 9-10 మధ్య రాత్రి భారత్ దాడులు ప్రారంభించిన కొన్ని క్షణాల తర్వాత తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ నాకు ఫోన్ చేసి చెప్పారు. రావిల్పిండిలోని నూర్ ఖాన్ సహా ఇతర స్థావరాలపై దాడి జరిగింది. ఆ సమయంలో మా వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం, చైనీస్ యుద్ధ విమానాలను వినియోగించింది’’ అని పాక్ ప్రధాని వెల్లడించారు.
అయితే పాకిస్తాన్ నేతలు వేస్తున్న పిల్లిమొగ్గలు.. అంతర్జాతీయ సమాజాన్ని నివ్వెర పరుస్తున్నాయి. అసలు వారు ఏం చేస్తున్నారు..? ఏం చెబుతున్నారన్న అంశంతో సంబంధం లేకుండా ప్రపంచదేశాలు తమ గూఢచర్య నెట్ వర్క్ వినియోగించి.. వివరాలు తెలుసుకుంటున్నాయి. అంటే.. పాక్ నేతలు చెప్పేవన్నీ అబద్దాలేనని సాక్షాత్తూ అంతర్జాతీయ సమాజం భావిస్తోందన్నమాట.