Washington: అంతర్జాతీయ ఉగ్రవాదానికి అమెరికా విధానాలే కారణమన్న పాక్..

పాకిస్తాన్ (Pakistan) గళాన్ని అంతర్జాతీయ వేదికలపై వినిపించేందుకు ప్రయత్నిస్తున్న ఆదేశ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టో (bilawal bhutto) విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. నేరుగా అమెరికాలో పర్యటిస్తున్న ఆయన.. ఆదేశాన్నే తప్పుపట్టాల్సిన దుస్థితి దాపురించింది. ఉగ్రవాదంపై తమ గొంతు వినిపిస్తున్న బిలావల్ కు.. అమెరికన్ చట్టసభ సభ్యులు అడుగుతున్న ప్రశ్నలు మింగుడు పడడం లేదు. లేటెస్టుగా ఓ కాంగ్రెస్ సభ్యులు.. పాక్ లో ఉన్న ఉగ్రవాదులను .. అడ్రస్ లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. బిన్ లాడెన్ ను పట్టించిన వైద్యుడి రక్షణ విషయాన్ని సైతం ప్రస్తావించాడు. దీంతో పాక్ గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లైంది.
ఈసందర్భంగా బిలావల్.. ఓ సంచలన కామెంట్స్ చేశారు. ఉగ్రవాదానికి అఫ్గానే (Afghanistan) కారణమనేలా ఆయన మాట్లాడుతూ.. పరోక్షంగా అగ్రరాజ్యాన్నీ నిందించారు. అమెరికా దళాలు కాబూల్ నిష్క్రమణ సమయంలో అఫ్గాన్‌లో వదిలిపెట్టిన మిలిటరీ ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా తయారుచేసిన ఎం117 సాయుధ వాహనాలు, ఎం-17 హెలికాప్టర్లు, ఎం4 అసాల్ట్ తుపాకులు, 2.5 లక్షలకుపైగా రైఫిళ్లు, చీకట్లో వీక్షణకు ఉపయోగించే 18వేల నైట్ విజన్ గాగుల్స్ వంటి అధునాతనమైన ఆయుధాలతో ముష్కరులు దాడులకు పాల్పడుతుండడంతో వారిని ఎదుర్కోవడం తమ దేశంలోని పోలీసులకు పెద్ద సమస్యగా మారిందని అన్నారు.
ఆ ఆయుధాలు వారి వద్ద ఉండడం వల్లే ప్రస్తుతం పాక్ ఇబ్బందులు పడుతోందని వ్యాఖ్యానించారు. దీని ప్రభావం అమెరికా- పాక్ సంబంధాల పైనా పడుతోందన్నారు. అమెరికా దళాలు కాబూల్ నుంచి ఉపసంహరించుకున్నాక అక్కడ మిగిలిఉన్న ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రస్తుతం తమకు ప్రాంతీయ, అంతర్జాతీయ సహకారం కావాలన్నారు. గతంలో పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. అమెరికా వల్లే తాము చాలా చెత్త పనులు చేశామని ఉగ్రవాదాన్ని ఉద్దేశించి మాట్లాడిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో భుట్టో అమెరికాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
2021, ఆగస్టులో అఫ్గానిస్థాన్‌లో పౌర ప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. వారి పాలనలో ఆంక్షలకు భయపడి ప్రాణభయంతో పలువురు దేశం విడిచివెళ్లిపోయారు. 20 ఏళ్ల పాటు అఫ్గానిస్థాన్‌లో సేవలు అందించిన తమ బలగాలను అమెరికా ఆకస్మికంగా ఉపసంహరించుకోవడంతో తాలిబన్లకు అవకాశం లభించింది. అమెరికా, ఇతర దేశాల దళాలు వదిలేసి వెళ్లిన ఆయుధాలను వారు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ముష్కరులు అమెరికా తయారీ ఎం4 కార్బైన్ తుపాకులనూ వాడినట్లు భారత అధికారులు వెల్లడించారు. కాబూల్‌ను వీడే సమయంలో అగ్రరాజ్యం తన ఆయుధాలను తాలిబన్లు, ఉగ్రవాదుల చేతుల్లో పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే అవి వారి చేతుల్లోకి వెళ్లాయని సమాచారం.