అమెరికాలో కాల్పుల కలకలం…

అమెరికాలో వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. 32 మంది గాయపడ్డారు. దక్షిణ కరోలీనాలోని నార్త్ చార్లెట్‍టన్‍లో శనివారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఓ సంగీత కచేరి జరుగుతున్న సమయంలో కాల్పులు జరిగాయి. 14 ఏళ్ల బాలిక మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. ఈ సంగీత కచేరి అనధికారికంగా నిర్వహించారని, ఈ సందర్భంగా కొందరి మధ్య గొడవ జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసులు చెప్పారు. ఒహాయో రాష్ట్రం యంగ్స్టౌన్‍లో ఓ బార్ బయట ఆదివారం వేకువజామున 2 గంటల తర్వాత కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. న్యూజెర్సీలని ఫెయిర్‍ఫీల్డ్ టౌన్‍షిప్‍లో జరిగిన మరో కాల్పుల ఘటనలో ఓ యువతి (25), యువకుడు (30) ప్రాణాలు కోల్పోయారు. 12 మంది గాయపడ్డారు. వందల మందితో ఓ హౌస్ పార్టీ జరుగుతున్న సమయంలో కాల్పులు జరిగాయి. ఈ మూడు ఘటనలపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.