Air India : ఎయిరిండియా ప్రమాదం.. బోయింగ్‌పై అమెరికాలో దావా

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా (Air India) విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో మృతులకు సంబంధించిన నాలుగు కుటుంబాలు విమాన తయారీ సంస్థ బోయింగ్‌పై అమెరికా (America) లో దావా వేశారు. ఈ పిటిషన్‌లో విడిభాగాల తయారీ సంస్థ హనీవెల్ (Honeywell) పేరును కూడా చేర్చాయి. ఈ మేరకు ఆ కుటుంబాలు దాఖలు చేసిన ఈ దావాలో ఇంధన స్విచ్‌లు లోపభూయిష్టంగా ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించాయి. 787 డ్రీమ్‌లైనర్ (Dreamliner) విమానం డిజైన్, దాని విడిభాగాల అభివృద్ధి సమయంలోనే లోపాలు వారికి తెలుసని, అయినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఇందన సరఫరా, విమాన థ్రస్ట్ నియంత్రణకు సంబంధించిన డిజైన్ లోపం ఉంది అని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. అంతేకాక అకస్మాత్తుగా వచ్చిపడే ప్రమాదాలను నిలువరించేందుకు ఆ రెండు సంస్థలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదన్నాయి. స్విచ్‌లకు తనిఖీలు, మరమ్మతులు అవసరమని విమానాయాన సంస్థలను హెచ్చరించలేదన్నారు.వాటిని రీప్లేస్ చేసేందుకు అవసరమయ్యే విడిభాగాలను పంపించడంలో కూడా ఈ రెండు కంపెనీలు విఫలమైనట్లు తెలిపాయి. ఈ పిటిషన్‌పై బోయింగ్ (Boeing) , హనీవెల్ సంస్థలు ఇప్పటి వరకు స్పందించలేదు.