Amit Shah: చొరబాటుదారులను కాపాడటమే ఇండియా కూటమి లక్ష్యం: అమిత్ షా

‘ఓట్ల చోరీ’ అంటూ ‘ఇండియా’ కూటమి చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, వాళ్లు కేవలం చొరబాటుదార్లను (Infiltrators) కాపాడేందుకే ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) విమర్శించారు. గతంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయంటూ ఇదే రకమైన దుష్ప్రచారం చేశారని ఆయన అన్నారు. బిహార్‌లోని డెహరీ ఆన్ సోన్‌లో పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఇటీవల నిర్వహించిన ‘ఓట్ అధికార్ యాత్ర’ కూడా బంగ్లాదేశ్ నుండి వచ్చిన చొరబాటుదారులను (Infiltrators) రక్షించే లక్ష్యంతోనే జరిగిందని అమిత్ షా (Amit Shah) ఆరోపించారు. ఒకవేళ ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే, బిహార్ పూర్తిగా చొరబాటుదారులతో నిండిపోతుందని, ఈ విషయాన్ని ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలకు ఆయన (Amit Shah) సూచించారు.
త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Elections) నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు అమిత్ షా ఈ పర్యటన చేపట్టారు. మగధ-శాహాబాద్ ప్రాంతంలోని 10 జిల్లాల నేతలతో ఆయన (Amit Shah) సమావేశమయ్యారు. 2020 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఎన్డీయే పనితీరు అంతంతమాత్రంగా ఉండటంతో, బీజేపీ ఈసారి ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అంతకుముందు సీఎం నితీశ్ కుమార్ కూడా పాట్నాలో అమిత్ షాను (Amit Shah) కలిశారు.