కోహ్లీ అంటే భయమా…? మైండ్ గేమ్ ఆడుతున్నారా…?
భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ లైనప్ కు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ వెన్నుముఖ. ఈ విషయంలో ఏ సందేహం లేదు… వైట్ బాల్, రెడ్ బాల్ ఏ ఫార్మాట్ అయినా కోహ్లీ దూకుడు గత 15 ఏళ్ళ నుంచి భారత క్రికెట్ అభిమానులు చూస్తూనే ఉన్నారు. చేజింగ్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ అయినా సరే కోహ్లీని మించిన ఆటగాడు లేడు. అలాంటి కోహ్లీ… గత కొన్నాళ్ళుగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. పరుగులు చేయలేక సతమతం అవుతున్నాడు. కీలక సమయాల్లో కోహ్లీ నుంచి భారీ ఇన్నింగ్స్ లు రావడమే కష్టంగా మారింది.
కివీస్ పర్యటనలో యువ ఆటగాళ్ళు ఎంతోకొంత పర్వాలేదు అనిపించినా విరాట్ కోహ్లీ మాత్రం ఆకట్టుకోలేదు. ఒకప్పుడు మంచి నీళ్ళు తాగిన ప్రాయంగా సెంచరీలు చేసిన కోహ్లీ… ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నాడు. ఇలాంటి తరుణంలో అత్యంత కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు బయల్దేరింది. యువ ఆటగాళ్లకు కోహ్లీ… మార్గనిర్దేశనం చేస్తూ భారీ ఇన్నింగ్స్ లు ఆడాల్సిన అవసరం లేదు. కాని కోహ్లీపై గతంలో ఉన్న పరుగుల దాహం కరువైంది. బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ… స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించే ఈ పరుగుల యంత్రం… అలసిపోయినట్టు కనపడుతోంది.
కానీ… ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్ళు, అక్కడి మీడియా మాత్రం కోహ్లీని తక్కువ అంచనా వేయవద్దు, అతనితో మాటల యుద్ధం వద్దు అని తమ ఆటగాళ్లను హెచ్చరిస్తోంది. మెక్ గ్రాత్ ఇదే మాట చెప్పాడు. ఇక డేవిడ్ వార్నర్ అయితే… అందరూ ఇండియా గురించి భయపడుతున్నారు… కాని నాకు ఆస్ట్రేలియా గురించి భయంగా ఉంది అంటూ… కోహ్లీని ఆకాశానికి ఎత్తేశాడు. దీనితో అసలు ఆస్ట్రేలియా టూర్ విషయంలో కోహ్లీ అంటే భయమా లేక మైండ్ గేమ్ ఆడుతున్నారా అనేది క్లారిటీ రావడం లేదు.
విరాట్ కోహ్లీ… న్యూజిలాండ్ తో సీరీస్ ఓటమిని అవమానంగా భావిస్తున్న మాట వాస్తవం. తాను పరుగులు చేయకపోవడం కోహ్లీ మరింత అవమానంగా భావిస్తున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీకి మంచి రికార్డ్ ఉంది. కాని ఎంత వరకు పరుగులు చేస్తాడో చెప్పలేని పరిస్థితి. ఆస్ట్రేలియా మైండ్ గేమ్ ఆడటంలో దిట్ట. అందులో ఏ సందేహం లేదు. మరి కోహ్లీ వారి అంచనాలను అందుకుంటాడా… అంచనాల సంగతి దేవుడెరుగు… కనీసం పరుగులు అయినా చేస్తాడా అంటూ భారత క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.






