Marco Rubio : భారత్-రష్యా బంధం.. మాకు ఇబ్బందికరం

భారత్ కొంటున్న చమురుతోనే ఉక్రెయిన్ (Ukraine) పై యుద్ధాన్ని రష్యా కొనసాగించగలుగుతోందని, ఇదే భారత్ (India)తో చర్చల్లో తమను ఇబ్బందిపెట్టే అంశమని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో (Marco Rubio) స్పష్టం చేశారు. ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటాదారు. వ్యూహాత్మక భాగస్వామి. అయితే అన్ని అంశాల్లో మాదిరిగా విదేశాంగ విధానంలోని ప్రతి విషయంలో 100 శాతం సమయం కేటాయించడం సాధ్యం కాదు అని రుబియో పేర్కొన్నారు. భారత్‌కు భారీగా ఇంధన అవసరాలున్నాయి. అన్ని దేశాల్లాగే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు చమురు, బొగ్గు, గ్యాస్ (Gas) కొనగలిగే శక్తి దానికి ఉంది. అయితే ఆ దేశం రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. ఆంక్షల వల్ల అక్కడ చమురు చౌకగా లభిస్తోంది. దురదృష్టవశాత్తూ అదే యుద్ధంలో మనగలగడానికి రష్యాకు ఉపయోగపడుతోంది అని ఆయన వ్యాఖ్యానించారు.