America: అమెరికాలో మరోసారి కలకలం… యూదులపై
అమెరికాలో యూదులపై మరో దాడి జరిగింది. ఇటీవల రాజధాని వాషింగ్టన్ (Washington)లో ఇద్దరు ఇజ్రాయెలీ దౌత్యవేత్తల హత్య ఘటన మరువకముందే కొలరాడో (Colorado)లోని బోల్డర్ కౌంటీలో దారుణం చోటుచేసుకుంది. హమాస్ (Hamas) చెరలోని బందీలకు సంఫీుబావం తెలుపుతున్న యూదులపై ఓ వ్యక్తి మండే స్వభావం ఉన్న ద్రావణాలున్న సీసాలను విసిరాడు. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. మైదానంలోకి గడ్డికి మంటలు అంటుకొని, ఆ ప్రాంతంలో దట్టంగా పొగ వ్యాపించింది. కొందరు వ్యక్తులపై ద్రావణం పడి, శరీర భాగాలకు నిప్పంటుకుంది. అనుమానితుడు మహమ్మద్ సాబ్రి సోలిమాన్ (Mohammed Sabri Soliman ) (45)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చొక్కా లేకుండా ఉన్న ఓ వ్యక్తి మండే స్వభావం గల ద్రావణాన్ని సీసాల్లో నింపి తీసుకొచ్చి పాలస్తీనా ప్రజలకు విముక్తి కల్పించాలని నినాదాలు చేస్తూ సీసాలను విసిరాడని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. దీన్ని ఉగ్రవాద చర్యగా భావిస్తూ దర్యాప్తు చేస్తున్నట్లు ఎఫ్బీఐ తెలిపింది.







