విమానం అదృశ్యం కథ విషాదాంతం
ఆఫ్రికా దేశమైన మలావీలో విమానం అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. అది పర్వత ప్రాంతాల్లో కూలిపోయిందని, ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా సహా 10 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా వెల్లడించారు. గల్లంతైన విమానం శకలాలను గుర్తించామని, అందులో ఎవరు ప్రాణాలతో లేరని తెలిపారు. మలాలీ ఉపాధ్యక్షుడు, మరో తొమ్మిది మందిని తీసుకెళ్తున్న సైనిక విమానం జూన్ 10న అదృశ్యమైంది. రాజధాని లిలోంగ్వే నుంచి బయలుదేరిన ఆ విమానం 370 కిలోమీటర్ల దూరంలోని జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. ప్రయాణ సమయం 45 నిమిషాలు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ దిగవద్దని, తిరిగి లిలోంగ్వేకు వెళ్లిపోవాలని ఏటీసీ సూచించింది. ఈ క్రమంలోనే రాడార్‌తో విమానం సంబంధాలు తెగిపోయాయి.
గల్లంతైన విమానం కోసం మలావీ సైన్యం భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ వందల మంది సైనికులు, పోలీసులు, అటవీ అధికారులతో ముమ్మరంగా గాలించింది. పొరుగు దేశాల హెలికాప్టర్లు, డ్రోన్లను రంగంలోకి దించింది. అంగోలా దేశ అంతరిక్ష కేంద్రం సహాయాన్ని కోరింది. అమెరికా, బ్రిటన్, నార్వే, ఇజ్రాయెల్ కూడా సహాయం అందించేందుకు ముందుకు వచ్చాయని మలావీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలోనే కూలిపోయిన విమాన శకలాలను గుర్తించినట్లు తెలిపింది.






