S Jai Shankar: టెర్రరిజంపై జీరో టాలరెన్స్.. తేల్చిచెప్పిన జైశంకర్
భారత్ ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించదని, టెర్రరిజంపై ‘జీరో టాలరెన్స్’ (సహన శూన్యత) విధానాన్ని నిర్దాక్షిణ్యంగా అమలు చేస్తుందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (Jai Shankar) స్పష్టం చేశారు. రెండు రోజుల భారత పర్యటనలో ఉన్న యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీతో న్యూఢిల్లీలో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని దేశాలు భారత్–పాకిస్తాన్లను సమానంగా చూసే ప్రయత్నాలు చేస్తున్నాయని, ఇది సరైన దృష్టికోణం కాదని జైశంకర్ తేల్చిచెప్పారు. ‘‘భారతదేశం ఉగ్రవాదంపై స్పష్టమైన వైఖరిని పాటిస్తోంది. మేము తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం. బాధితులను, ఆ దాడులు చేసే దుర్మార్గులను ఒకే తరహాలో చూసే ధోరణి పూర్తిగా అన్యాయం. మా భాగస్వాములు దీనిని సరిగ్గా అర్థం చేసుకోవాలి,’’ అని ఆయన అన్నారు. అదే సమయంలో ఇటీవల పహెల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించినందుకు, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో భారత్కు తమ మద్దతు ప్రకటించినందుకు యునైటెడ్ కింగ్డమ్కు జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.







