China: యుద్ధరంగంలో ఇరాన్ కు చైనా సాయం.. అమెరికా ఇప్పుడేం చేస్తుంది..?

ఇరాన్- ఇజ్రాయెల్ (Iran-Israel) మధ్య జరుగుతున్న యుద్ధంతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక విషయం వెలుగు చూసింది. టెల్‌అవీవ్‌తో యుద్ధంలో ఇరాన్‌కు చైనా (China) రహస్యంగా సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. డ్రాగన్‌కు చెందిన పలు బోయింగ్ విమానాల్లో ఇరాన్(Iran)కు ఆయుధాలు తరలిపోతున్నట్లు సమాచారం.
జూన్ 14 నుంచి దాదాపు ఐదు బోయింగ్-747 విమానాలు చైనాలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరాయి. అవి కజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్ మీదుగా ప్రయాణించి ఇరాన్ వైమానిక ప్రాంతానికి చేరుకున్నాయి. అయితే, విమాన గమ్యస్థానాలు లక్సెంబర్గ్ (Luxembourg) కాగా.. అవి అసలు యూరోపియన్ గగనతలంలోకి ప్రవేశించకపోవడం గమనార్హం. సాధారణంగా ఈ రకం విమానాలను రవాణా కోసం వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు డ్రాగన్ మిలిటరీ సాయం అందిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన దీర్ఘకాల మిత్రదేశమైన టెహ్రాన్‌కు బీజింగ్ సాయం చేసే అవకాశం లేకపోలేదని పలువురు నిపుణులు కూడా పేర్కొంటున్నారు.
కాగా.. చైనా నుంచి ఇరాన్‌కు వెళ్తున్నట్లు అనుమానిస్తున్న బోయింగ్-747 విమానాలతో తమకెలాంటి సంబంధం లేదని లక్సెంబర్గ్‌కు చెందిన కార్గో విమానయాన సంస్థ కార్గోలక్స్ వెల్లడించింది. ఈమేరకు తన అధికారిక సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రకటనను విడుదల చేసింది. అందులో తన విమానాలు ఏవీ ఇరాన్ గగనతలాన్ని ఉపయోగించుకోవని కార్గోలక్స్ తెలిపింది. తమ ఎయిర్‌లైన్ కార్యకలాపాలు పూర్తిగా పారదర్శకంగా ఉన్నాయని వెల్లడించింది.
ఇదిలాఉండగా.. అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుండగా.. ఇరాన్ భారీగా క్షిపణులను ప్రయోగిస్తుంది. ఇవి పౌర నివాసాలను తాకడంతో టెల్‌అవీవ్‌లోనూ అనేకమంది పౌరులు గాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడికి అమెరికా కూడా సిద్ధమవుతున్నట్లు వస్తున్న వార్తలు ఈ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేశాయి. అయితే, టెహ్రాన్ అణుస్థావరాలపై దాడి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని వైట్‌హౌస్ తెలిపింది.