Raja Singh: బీజేపీకి తలనొప్పిగా మారిన రాజాసింగ్
తెలంగాణ బీజేపీకి ఎమ్మెల్యే రాజా సింగ్ (MLA Raja Singh) తలనొప్పిగా మారారు. పార్టీ నుంచి సస్పెండ్ అయినా కూడా ఆయన బీజేపీపై (BJP) విమర్శలు ఆపట్లేదు. తాజాగా మరోసారి ఆయన విమర్శల వర్షం కురిపించారు. కేంద్ర మంత్రి బండి కిషన్ రెడ్డి (Kishan Reddy) మీద ఆరోపణలు చేశారు. ఆయన రాజీనామా చేస్తే తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఇద్దరూ స్వతంత్రులుగా ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరి దమ్ము ఎక్కువో తెలుస్తుందన్నారు. కిషన్ రెడ్డి వల్లే తెలంగాణలో పార్టీ నాశనమైందని ఆరోపించారు. ప్రస్తుత కమిటీతో బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాజా సింగ్ అన్నారు. పార్టీ అధిష్టానం పిలుపుకోసం వెయిట్ చేస్తున్నానని, తాను ఇతర పార్టీల్లో చేరబోనని స్పష్టం చేశారు.
రాజాసింగ్ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో కొత్త చర్చ లేవనెత్తాయి. పార్టీపై ధిక్కార స్వరం వినిపించడంతో ఆయన్ను బీజేపీ సస్పెండ్ చేసింది. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కొందరు పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కామెంట్స్ కు రాజా సింగ్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తేనే తాను కూడా రాజీనామా చేస్తానన్నారు. ఇద్దరం ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే ఎవరి బలం ఎక్కువో తెలుస్తుందన్నారు. కిషన్ రెడ్డి వల్లే పార్టీ నాశనమైందని రాజా సింగ్ అన్నారు. ప్రస్తుత బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచందర్ రావును (Ramachandra Rao) రబ్బర్ స్టాంప్ అని విమర్శించిన రాజాసింగ్, కొత్త కమిటీతో పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. తాను ఎప్పటికీ బీజేపీలోనే ఉంటానన్నారు. అధిష్టానం పిలిస్తే వెంటనే చేరుతానని, వేరే పార్టీల్లో చేరనని తేల్చేశారు.
బీజేపీలో ప్రస్తుత పరిస్థితిపై రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. పార్టీలో దొంగలంతా ఒకటయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై సల్లబడి, ప్రతిపక్ష పార్టీగా బాధ్యతలు నిర్వహించడం మానేశారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై రెచ్చిపోయి పోరాడిన బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్‌పై ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు కబ్జా కేసులో ఇరుక్కుని కాంగ్రెస్ భజన చేస్తున్నారని, బండి సంజయ్ కూడా కాంగ్రెస్ మంత్రులను పొగడుతున్నారని పేర్కొన్నారు. ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి నేతలు కాంగ్రెస్‌తో కుమ్మక్కుతున్నారని, ఇలా కొనసాగితే పార్టీకి ప్రయోజనం ఉండదన్నారు.
తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. అయితే పార్టీ పుంజుకుందని భావించిన ప్రతిసారీ పలు కారణాలతో వెనకబడుతోంది. బండి సంజయ్ నేతృత్వంలో పార్టీ బాగా పికప్ అయిందని అందరూ అనుకున్నారు. అలాంటి సమయంలో బండి సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డికి పగ్గాలిచ్చారు. కిషన్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన బీజేపీ, ఆశించినన్ని సీట్లు సాధించలేదు. అయినా ఆయన్నే కొనసాగించింది. ఇటీవల రామచంద్రరావుకు పగ్గాలిచ్చింది. ఆయనకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడాన్ని రాజాసింగ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆ కామెంట్స్ తోనే రాజా సింగ్ సస్పెన్షన్ కు గురయ్యారు. అయినా రాజాసింగ్ మాత్రం విమర్శించడం ఆపట్లేదు. ఇప్పటికీ ఆయన బీజేపీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది కమలం పార్టీకి పెద్ద సవాల్ గా మారింది. ఇప్పటికే సస్పెండ్ చేయడంతో ఇక చర్యలు తీసుకోవడానికి వీల్లేకుండా పోయింది.







