Pink Diamond: తిరుపతి లో పోయింది అని ఆరోపణలు వచ్చిన పింక్ డైమండ్ గురించి లేటెస్ట్ అప్డేట్

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఆలయాల్లో ఒకటి. శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆభరణాల్లో రాజులు, మహారాజులు బహూకరించిన అపారమైన రత్నాలు, బంగారు, వెండి వస్తువులు ఉన్నాయి. 2018లో ఈ ఆభరణాల్లో ఒక్కటైన పింక్ డైమండ్ (pink diamond) మాయమైందనే వార్తలు సంచలనం సృష్టించాయి. ఆలయ ప్రధాన అర్చకుడు ఎ.వి.రమణ దీక్షితులు (Ramana Deekshitulu), అప్పటి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ఈ ఆరోపణలు చేశారు. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబుకు ఇది పెద్ద సవాల్ గా మారింది. తాజాగా పింక్ డైమండ్ పై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) డైరెక్టర్ కె.మునిరత్నం రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసలు పింక్ డైమండ్ లేదని, అది కేవలం కెంపు మాత్రేనని స్పష్టం చేశారు. అది మాయమైనట్లు ఎలాంటి ఆధారం లేదని నిర్ధారించారు.
2018 మేలో తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఒక ప్రెస్‌మీట్ పెట్టి సంచలన ప్రకటన చేశారు. శ్రీవారి ఆభరణాల్లో భాగంగా మైసూరు మహారాణి ప్రమోద దేవి 1952లో దానం చేసిన ప్లాటినం చైన్‌లో ఉన్న పింక్ డైమండ్ మాయమైందని చెప్పారు. దాన్ని కొందరు విదేశాల్లో వేలానికి పెట్టి అమ్మేసుకున్నారని ఆరోపించారు. ఈ డైమండ్ విలువ రూ.500 కోట్లకు పైగా ఉంటుందని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పింక్ డైమండ్ అని వెల్లడించారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని (Chandrababu Govt) టార్గెట్ గా చేసుకుని రమణ దీక్షితులు ఈ ఆరోపణలు చేశారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రమణ దీక్షితులు ఆరోపణలను వైసీపీ రాజకీయ అస్త్రంగా వాడుకుంది. పింక్ డైమండ్ ను చంద్రబాబు తన ఇంట్లో దాచుకున్నారని, ఆయన ఇంటిని తనిఖీ చేయాలని అప్పటి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. అప్పట్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా దీనిపై విమర్శలు గుప్పించారు. అప్పటి టీటీడీ ఈవో అనిల్ సింఘాల్.., అది డైమండ్ కాదని, కేవలం కెంపు మాత్రమేనని క్లారిటీ ఇచ్చినా వివాదం ఆగలేదు.
ఆరోపణలు తీవ్రం కాడవంతో రమణ దీక్షితులు, విజయసాయి రెడ్డిపై టీటీడీ పరువనష్టం దావా వేసింది. రూ.200 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. రమణ దీక్షితులను ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించింది. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, టీటీడీ బోర్డు ఈ కేసులను ఉపసంహరించుకుంది. ఇది మరో వివాదానికి దారితీసింది. దీనిపై బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కేసు ఉపసంహరణకు వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై అప్పటికే రెండు కమిటీలు దర్యాప్తు చేసి పింక్ డైమండ్ లేదని నిర్ధారించాయని, మరో దర్యాప్తు అవసరం లేదని తేల్చాయి. టీటీడీ మాజీ జెఈఓ ధర్మారెడ్డి కూడా 1952 నుంచి ఎటువంటి పింక్ డైమండ్ రికార్డుల్లో లేదని చెప్పారు.
ఏఎస్‌ఐ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి కూడా 2018లోనే పింక్ డైమండ్ పై క్లారిటీ ఇచ్చారు. మైసూరు మహారాణి ప్రమోద దేవితో మాట్లాడి, అది కేవలం కెంపు (రూబీ) మాత్రమేనని ధృవీకరించారు. తాజాగా ఆయన మరోసారి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. అది కేవలం కెంపు మాత్రమేనని, డైమండ్ కాదని స్పష్టం చేశారు. అప్పట్లో ఆ హారాన్ని ఢిల్లీలో రూ.8500లకు తయారు చేయించినట్లు తెలిపారు. దీంతో పింక్ డైమండ్ పై రమణ దీక్షితులు, విజయసాయి రెడ్డి చెప్పినవన్నీ అసత్యాలేనని తేలిపోయాయి.