India – China: భారత్ పొరుగు దేశాల్లో సంక్షోభం.. చైనాయే కారణమా..?

భారతదేశం (India) చుట్టూ ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాలు రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ సంక్షోభాల వెనుక చైనా (China) పరోక్ష లేదా ప్రత్యక్ష పాత్ర ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంతో సంబంధాలను కాదని చైనాకు దగ్గరకావడం వల్ల ఈ దేశాల్లో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయా దేశాల్లో చైనా భారీ పెట్టుబడులు పెట్టడం, వాటిపై రుణభారం మోపడం వల్ల ప్రాంతీయ ఆధిపత్యాన్ని సాధించే పనిలో ఉంది. ఈ ఉచ్చులో చిక్కుకున్న శ్రీలంక (Srilanka) ఇప్పటికే దారుణ పరిస్థితులు ఎదుర్కొంటోంది. బంగ్లాదేశ్ (Bangladesh) ఇప్పటికీ కోలుకోలేదు. నేపాల్ లో (Nepal) ఇప్పుడు ఏం జరుగుతోందో చూస్తున్నాం. మున్ముందు పాకిస్తాన్ (Pakistan) కు కూడా ఇదే గతి పడుతుందని అంచనా వేస్తున్నారు.
2022లో శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. విదేశీ మారక నిల్వలు దాదాపు శూన్యానికి చేరుకున్నాయి. ఇంధనం, ఆహారం, ఔషధాల కొరత, 54శాతానికి చేరిన ద్రవ్యోల్బణం ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. ప్రజలు తిరుగుబాటు చేశారు. అప్పటి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేను గద్దె దించారు. దీంతో ఆయన దేశం విడిచి పారిపోయారు. చైనా నుంచి తీసుకున్న భారీ రుణాలు, ముఖ్యంగా హంబన్‌తోటా ఓడరేవు నిర్మాణం కోసం తీసుకున్న $1.4 బిలియన్ల రుణం ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఈ రుణాన్ని చెల్లించలేక శ్రీలంక ఓడరేవును 99 సంవత్సరాల పాటు చైనాకు లీజుకు ఇచ్చింది. శ్రీలంకలో రాజపక్సే కుటుంబంతో చైనా సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. రాజపక్సే భారత్ తో సంబంధాలు కాదని చైనాతో స్నేహం చేశారు. చివరకు దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు.
2024లో బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనలు మిన్నంటాయి. ప్రభుత్వ ఉద్యోగ కోటా వ్యవస్థపై అసంతృప్తితో ప్రారంభమైన ఈ ఆందోళనలు షేక్ హసీనా ప్రభుత్వ పతనానికి దారితీసాయి. హసీనా భారతదేశానికి పారిపోయి వచ్చేశారు. షేక్ హసీనా, భారతదేశంతో సన్నిహిత సంబంధాలను నెరిపారు. అయితే ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP)కి ఇది నచ్చలేదు. అందుకే విద్యార్థులను రెచ్చగొట్టి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయించారు. వాళ్ల ప్లాన్ వర్కవుట్ అయింది. షేక్ హసీనాను గద్దె దించారు. తాత్కాలిక నాయకుడిగా ముహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టారు. చైనా నుండి బిలియన్ల డాలర్ల సహాయం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పొందుతున్నాడు. అయితే బంగ్లాదేశ్ కథ మేడిపండు చందంగా ఉందని, చైనాతో స్నేహం ఆ దేశానికి ఎప్పటికైనా ప్రమాదమేనని ఆ దేశంలోనే కొందరు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం నేపాల్ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. సోషల్ మీడియాపై నిషేధం అవినీతి రహిత ఉద్యమానికి దారితీశాయి. జెన్ Z నేతృత్వంలోని నిరసనలు ప్రధాని కె.పి.శర్మ ఓలీని గద్దె దించాయి. ఓలీ దేశం నుంచి పారిపోయారనే వార్తలు అందుతున్నాయి. ఆ దేశ మంత్రులంతా పారిపోయారు. నేపాల్ ఎంతోకాలంగా భారత్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. అయితే కమ్యూనిస్టు అయిన కేపీ శర్మ ఓలీ, చైనాకు దగ్గరయ్యారు. చైనా BRI ద్వారా రైలు మార్గాలు, విమానాశ్రయాల నిర్మాణంలో పెట్టుబడులు సాధించారు. చైనాకు దగ్గరవడాన్ని సహించలేని నేపాల్ ప్రజలు, యువత.. ఓలీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఇప్పుడు ఓలీని గద్దె దించారు.
పాకిస్తాన్‌లో కూడా చైనా భారీ పెట్టుబడులు పెడుతోంది. ముఖ్యంగా చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (CPEC) ద్వారా, దేశాన్ని ఆర్థికంగా ఆదుకుంటోంది. CPEC కింద $62 బిలియన్లకు పైగా పెట్టుబడులతో గ్వాదర్ ఓడరేవు, రహదారులు, రైలు మార్గాలు, ఇంధన ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. అయితే, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉంది. ద్రవ్యోల్బణం 20శాతానికి మించిపోయింది. విదేశీ మారక నిల్వలు నిండుకున్నాయి. రుణ భారం $125 బిలియన్లకు చేరుకుంది. ఇందులో చైనాకే $30 బిలియన్లకు పైగా రుణం ఉంది. చైనా రుణాలను తిరిగి చెల్లించడంలో పాకిస్తాన్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో గ్వాదర్ ఓడరేవు వంటి కీలక ఆస్తులు చైనా నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ లో రాజకీయ అస్థిరత కూడా సంక్షోభానికి కారణమవుతోంది.
శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ సంక్షోభాలకు పరోక్షంగా చైనాయే కారణమనే వాదనలు బలపడుతున్నాయి. అయితే అంతర్గత అవినీతి, పాలనా వైఫల్యాలు కూడా ఇందుకు దోహదం చేశాయి. చైనా ఈ అస్థిరతలను తన వ్యూహాత్మక లక్ష్యాల కోసం ఉపయోగించుకుంటోంది. దక్షిణాసియాలో భారతదేశ ఆధిపత్యాన్ని సవాలు చేస్తోంది. భారతదేశం తన దౌత్య, ఆర్థిక, భద్రతా విధానాలను బలోపేతం చేయడం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతోంది.