Donald Trump: ఇరాన్ విషయంలో ట్రంప్ మనసు మార్చిన అరబ్ దేశాలు!
గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ వంటి అరబ్ దేశాలు చేసిన దౌత్యపరమైన ఒత్తిడి ఫలించడంతో గల్ఫ్ ప్రాంతం ఊపిరి పీల్చుకుంది. ఇరాన్లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుండటంపై ట్రంప్ (Donald Trump) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో ఇరాన్‌పై సైనిక దాడికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే దాడి జరిగితే ప్రాంతీయంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని గల్ఫ్ మిత్రదేశాలు హెచ్చరించాయి. ఇరాన్‌కు మరో అవకాశం ఇవ్వాలని ట్రంప్‌ను ఒప్పించాయి. నిరసనకారులను ఉరితీయబోమని ఇరాన్ నుంచి హామీ లభించిన తర్వాతే ట్రంప్ శాంతించినట్లు సమాచారం.
ప్రస్తుతానికి ఉద్రిక్తతలు సద్దుమణిగినప్పటికీ, అమెరికా-ఇరాన్ మధ్య విభేదాలు పూర్తిగా తొలగిపోలేదు. ఇటీవలే మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేస్తామని ఇరాన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరం నుంచి కొంత సిబ్బందిని కూడా తరలించారు. ఏది ఏమైనా ట్రంప్‌తో (Donald Trump) అరబ్ దేశాల చర్చలతో ఈ ప్రాంతంలో పెద్ద యుద్ధం తప్పిందని విశ్లేషకులు భావిస్తున్నారు.






