Billionaires : అమెరికాలో భారత సంతతి బిలియనీర్ల హవా

అమెరికాలో భారత సంతతి సంపన్నుడెవరంటే.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) లేదా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లే (Satya Nadelle) గుర్తు కొస్తారు. అయితే భారత్‌లో పుట్టి అమెరికాలో బిలియనీర్లు గా అవతరించినవారిలో పిచాయ్, నాదెళ్ల కంటే ముందు ఇంకో 10 మందైనా ఉన్నారు. వారిలో 17.9 బిలియన్ డాలర్లతో జై చౌదరి అగ్రస్థానంలో ఉన్నారని ఫోర్బ్స్ తాజా జాబితా ఒకటి తెలియజేసింది. క్లౌడ్ సెక్యూరిటీ కంపెనీ జెడ్‌స్కాలర్ వ్యవస్థాపక సీఈవోనే ఈ 67 ఏండ్ల జై చౌదరి (Jai Chaudhary). అమెరికాలోని బిలియనీర్లలో 125 మంది విదేశాలకు చెందినవారే. వీరి సంపద 1.3 ట్రిలియన్ డాలర్లు. మూడింటా రెండొంతుల మంది టెక్నాలజీ, ఫైనాన్స్ రంగాలకు చెందినవారే. ఇక వీరంతా భారత్‌సహా 43 దేశాల నుంచి అమెరికాకు వలస వెళ్లారు. అలాగే ఈ సంపన్నులలో అత్యధికంగా 12 మంది భారతీయులున్నారు. నిజానికి అమెరికాలోని టాప్-10 అపర కుబేరుల్లోనూ ముగ్గురు విదేశీయులే. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, గూగుల్ సహవ్యవస్థాపకుడు సెర్గే బ్రిన్, ఎన్విదియా సహవ్యవస్థాపకుడు, సీఈవో జెన్సెన్ హంగ్ వీరిలో ఉండటం గమనార్హం.