Canada: 40 ఏళ్లుగా ఉగ్రవాదులను కెనడా అడ్డుకోలేదు: భారత దౌత్యవేత్త ఫైర్
కెనడా (Canada) గడ్డపై నుంచి జరుగుతున్న భారత వ్యతిరేక కుట్రలపై భారత రాయబారి దినేష్ పట్నాయక్ (Dinesh Patnaik) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత 40 ఏళ్లుగా కెనడా ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అరికట్టడంలో విఫలమవుతోందని ఆయన ధ్వజమెత్తారు. కెనడా (Canada) మీడియా సంస్థ ‘సీబీసీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై కెనడా (Canada) చేస్తున్న ఆరోపణలను కూడా పట్నాయక్ ఖండించారు. భారత్ ఏదైనా ఉగ్రవాద చర్య గురించి ఫిర్యాదు చేసినప్పుడు ‘ఆధారాలు చూపించండి’ అని అడిగే కెనడా, భారత్‌పై ఆరోపణలు చేసేటప్పుడు మాత్రం ఎలాంటి ఆధారాలు ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని చెబుతున్నప్పుడు, దానికి సంబంధించిన సాక్ష్యాలను ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు.
గత నాలుగు దశాబ్దాలుగా కెనడా (Canada) దేశాధినేతలు ఎవరూ ఉగ్రవాద కట్టడికి చిత్తశుద్ధితో చర్యలు తీసుకోలేదని పట్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ ఆధారాలతో సహా వివరాలు సమర్పించిన ఏ ఒక్క కేసులోనైనా నిందితులకు కెనడా కోర్టుల్లో శిక్ష పడిందా అని ఆయన ప్రశ్నించారు. కెనడా రాజధాని ఒట్టావా.. భారత వ్యతిరేక కుట్రలకు కేంద్రంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.






