డే అండ్ నైట్ లో కింగ్… కోహ్లినే, ఈ లెక్కలు చాలు
ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ గెలిచి మంచి ఊపు మీదున్న భారత జట్టు రెండో టెస్ట్ కోసం సిద్దమవుతోంది. డే అండ్ నైట్ టెస్ట్ అడిలైడ్ వేదికగా డిసెంబర్ ఆరు నుంచి ప్రారంభం కానుంది. ఓ వైపు తొలి టెస్ట్ గెలిచి ఊపు మీదున్న భారత జట్టు మరో వైపు తొలి టెస్ట్ భారీ తేడాతో ఓడిపోయి ఓటమి భారంతో కసి మీదున్న ఆస్ట్రేలియా జట్టు మధ్య పోరు ఎలా ఉంటుందో అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రదర్శనపై ఆ జట్టు మాజీలకు కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ తరుణంలో తమ జట్టుకు కీలక సలహాలు ఇస్తున్నారు.
ఇక అడిలైడ్ మైదానం విషయానికి వస్తే భారత జట్టు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లికి స్వర్గధామం లాంటి మైదానం ఇది. గతంలో కోహ్లి ప్రదర్శనలు చూస్తే అతనికి ఆడిలైడ్ మైదానం కొట్టిన పిండి అనేది అర్ధమవుతుంది. ఈ మైదానంలో కోహ్లీ 11 మ్యాచ్ లు ఆడగా… 957 పరుగులు చేసాడు. 5 సెంచరీలతో 73.61 యావరేజ్ తో దుమ్ము రేపాడు కోహ్లి. ఇక డే అండ్ నైట్ మ్యాచ్ లో కూడా ఇక్కడ కోహ్లీ మంచి ప్రదర్శన చేసాడు. డే అండ్ నైట్ టెస్ట్ లో చివరి సారి అడిలైడ్ మైదానంలో భారత్ ఆడగా కోహ్లీ 74 పరుగులు చేసాడు.
4 డే అండ్ నైట్ మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 46 సగటుతో 277 పరుగులు చేసి రాణించాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా డే అండ్ నైట్ టెస్ట్ లో తొలి సెంచరీ చేసింది కూడా కోహ్లీనే. ఆ రికార్డ్ కోహ్లీ పేరు మీదనే ఉంది ఇప్పటికీ. ఇక భారత జట్టు విషయానికి వస్తే నాలుగు డే అండ్ నైట్ టెస్ట్ లు ఆడగా ఇండియా అందులో మూడు టెస్ట్ లు గెలిచింది. ఈ లెక్కలు అన్నీ ఇప్పుడు భారత్ కు పాజిటివ్ గానే ఉన్నాయి. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు భారత్ చేరుకోవాలి అంటే ఈ సీరీస్ అత్యంత కీలకం కావడంతో భారత ఆటగాళ్ళు పట్టుదలగా ఉన్నారు.






