Supreme Court: ‘భారత్ ధర్మసత్రం కాదు..’ సుప్రీంకోర్టు సంచలన తీర్పు

భారత సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం శరణార్థులకు (refugees) సంబంధించి సంచలన తీర్పు వెలువరించింది. “భారత్ ఒక ధర్మశాల (Dhramashala) కాదు, ప్రపంచవ్యాప్తంగా వచ్చే శరణార్థులకు ఆశ్రయం ఇవ్వలేం” అని స్పష్టం చేసింది. శ్రీలంక తమిళ శరణార్థి (Srilankan Tamil Refugee) ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. శరణార్థులు తక్షణం భారత్‌ను వీడాలని కోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
1983లో శ్రీలంకలో అంతర్యుద్ధం (civil war) మొదలైంది. LTTE తీవ్రవాదులకు, శ్రీలంక ప్రభుత్వానికి మధ్య పోరాటం ప్రారంభమైంది. ఈ అంతర్యుద్ధం కారణంగా లక్షలాది తమిళులు శరణార్థులుగా మారారు. 1983-1987 మధ్య జరిగిన ఘటనల్లో భయాందోళనకు గురైన తమిళులు పెద్ద సంఖ్యలో భారత్‌లోని తమిళనాడుకు (Tamilnadu) వలస వచ్చారు. భారత్, మానవతాదృక్పథంతో వీరికి ఆశ్రయం కల్పించింది. ప్రస్తుతం తమిళనాడులోని 109 శరణార్థి శిబిరాల్లో 60వేల మందికి పైగా శ్రీలంక తమిళ శరణార్థులు నివసిస్తున్నారు. వీళ్లంతా చాలాకాలంగా ఇక్కడే ఉండిపోవడంతో.. తమకు పౌరసత్వం, ఉపాధి, విద్య వంటి ప్రాథమిక హక్కులు కల్పించాలని పోరాడుతున్నారు.
శ్రీలంక తమిళ శరణార్థి ఒకరు ఈ అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను హిరాసత్‌లో ఉంచడం, బలవంతంగా శ్రీలంకకు తిరిగి పంపే ప్రమాదం ఉందని వాదించారు. అయితే.. జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం, “భారత్ 140 కోట్ల జనాభాతో సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే శరణార్థులందరికీ ఆశ్రయం కల్పించడం సాధ్యం కాదు” అని పేర్కొంది. భారత్ 1951 రిఫ్యూజీ కన్వెన్షన్‌కు సంతకం చేయని దేశం కావడం, దేశ భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.
శ్రీలంక తమిళ శరణార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి- వారిని ‘అక్రమ వలసదారులు’గా పరిగణించడం. భారత్‌లో రిఫ్యూజీలకు సంబంధించి నిర్దిష్ట చట్టం లేకపోవడంతో వీళ్లు ఫారినర్స్ యాక్ట్ 1946, పాస్‌పోర్ట్ యాక్ట్ 1967 వంటి చట్టాల కింద హిరాసత్‌లోకి తీసుకోబడుతున్నారు. శ్రీలంకలో అంతర్యుద్ధం ముగిసినప్పటికీ తమిళులపై వివక్ష, హింస ఇంకా కొనసాగుతున్నాయని.. తిరిగి పంపితే తమ ప్రాణాలకు ముప్పు ఉందని శరణార్థులు భయపడుతున్నారు. ఈ కారణంగా వారు నాన్-రిఫౌల్మెంట్ సూత్రం (పీడనకు గురయ్యే దేశానికి తిరిగి పంపకూడదనే అంతర్జాతీయ చట్టం) ఆధారంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు.
సుప్రీంకోర్టు ఈ నిర్ణయానికి రావడానికి పలు కారణాలు ఉన్నాయి. 1951 రిఫ్యూజీ కన్వెన్షన్‌కు భారత్ సంతకం చేయలేదు. కాబట్టి నాన్-రిఫౌల్మెంట్ సూత్రం భారత్‌పై చట్టబద్ధంగా వర్తించదని కోర్టు భావిస్తోంది. అంతేకాక.. అక్రమ వలసదారుల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. ఇక చివరగా.. భారత్‌లో ఇప్పటికే జనాభా ఎక్కువగా ఉంది. ఆర్థిక, ఆహార సవాళ్లున్నాయి. ఇలాంటప్పుడు అదనపు శరణార్థుల భారాన్ని భరించడం కష్టమని కోర్టు అభిప్రాయపడింది.
సుప్రీంకోర్టు తీర్పు శ్రీలంక తమిళ శరణార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారత్‌లో శరణార్థుల పట్ల గతంలో ఉన్న మానవతాదృక్పథానికి ఈ తీర్పు విరుద్ధమని మానవ హక్కుల సంస్థలు విమర్శిస్తున్నాయి. అయితే కొందరు ఈ తీర్పును దేశ భద్రత, జనాభా నియంత్రణ దృష్ట్యా సమర్థిస్తున్నారు. మొత్తంగా సుప్రీంకోర్టు తీర్పు శరణార్థుల విషయంలో భారత్ వైఖరిని స్పష్టం చేసింది. అయితే ఈ నిర్ణయం శరణార్థుల జీవితాలపైన ఎలాంటి ప్రభావం చూపుతుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది.