H1B visa: హెచ్1 బీ వీసాల ఫీజులపై బేఫికర్ … కంపెనీల లాభాలకూ ఢోకా ఉండదు

హెచ్-1బీ వీసా (H1B visa)ల ఫీజును డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కారు లక్ష డాలర్లకు పెంచిన ప్రభావం, భారత ఐటీ కంపెనీలపై పెద్దగా ఉండదని దేశీయ పరపతి రేటింగ్ సంస్థ క్రిసిల్ (Crisil) వెల్లడించింది. భారత ఐటీ సర్వీస్ కంపెనీలు ట్రంప్ పెంచిన వీసా ఫీజులో 30 నుంచి 70 శాతం భారాన్ని అమెరికా క్లయింట్లకే బదిలీ చేసే అవకాశం ఉన్నందున, వాటి నిర్వహణ లాభాలపైనా ఈ పెంపు ప్రభావం పెద్దగా ఉండదని స్పష్టం చేసింది. ఈ కంపెనీల నిర్వహణ లాభాలు గత ఏడాదితో పోలిస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరం మహా అయితే 10-20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతానికి సమానం) తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. అమెరికా ప్రభుత్వం (US Government) నిన్న మొన్నటి వరకు ఒక్కో హెచ్-1బీ వీసాపై 2,000 డాలర్ల నుంచి 5,000 డాలర్లు ఫీజుగా వసూలు చేసింది. ఈ నెల 21 నుంచి ఈ మొత్తాన్ని లక్ష డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ఐటీ పరిశ్రమ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.