Donald Trump: ఫార్మాపై ట్రంప్ పిడుగు.. వందశాతం టారిఫ్ విధింపు..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మరోసారి టారిఫ్ లతో విరుచుకుపడ్డారు. ఈసారి ఫార్మా రంగాన్ని టార్గెట్ చేశారు ట్రంప్. బ్రాండెడ్ లేదా పేటెంటెడ్ ఔషధాలపై ఏకంగా 100 శాతం దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఇక, కిచెన్ క్యాబినెట్, బాత్‌రూమ్ వానిటీలపై 50శాతం, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్‌పై 30శాతం, భారీ ట్రక్కులపై 25శాతం టారిఫ్‌లు (Trump Tariffs) విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సుంకాలు అక్టోబరు 1 నుంచి వర్తించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. జాతీయ భద్రతతో పాటు ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకుని ఈ టారిఫ్‌లు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే, అమెరికాలో ప్లాంట్‌లను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు ఈ సుంకాలు వర్తించవని పేర్కొన్నారు.
భారత్ ఫార్మా రంగానికి గడ్డు కాలమే..
ట్రంప్ విధించిన భారీ టారిఫ్ లు.. ఇండియా ఫార్మా రంగంపై పెను ప్రభావం చూపనుంది. ఎందుకంటే భారత ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తంగా 27.9 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇందులో 31 శాతం అంటే.. దాదాపు 8.7 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలు అగ్రరాజ్యానికే వెళ్లాయి. ఇక, ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఇప్పటికే 3.7 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది.
అమెరికాలో ఉపయోగించే జనరిక్ ఔషధాల్లో 45శాతం, బయోసిమిలర్ ఔషధాల్లో 15శాతం భారత్ సరఫరా చేసినవే. డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జైడస్, సన్‌ఫార్మా, గ్లాండ్ ఫార్మా వంటి సంస్థల మొత్తం ఆదాయంలో 30-50శాతం అమెరికా మార్కెట్ నుంచే లభిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ విధించిన టారిఫ్‌లతో అమెరికా మార్కెట్‌లో ఈ ఔషధాల ధరలు రెట్టింపు కానున్నాయి.
ఇప్పటికే రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్‌పై ట్రంప్ 50శాతం సుంకాలు విధించారు. దానిపై ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల వేళ ట్రంప్ తాజాగా ఫార్మా ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించడం మరింత గందరగోళానికి దారితీసింది.