బ్రిటన్లో ప్రతిపక్ష నేతగా భారత సంతతి మహిళ?
బ్రిటన్లో ప్రతిపక్ష నేత పదవికి భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ (52) పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎన్నికల్లో విథామ్ నుంచి పార్లమెంటుకు ఎన్నికైన ఆమె ఉగాండాలో స్థిరపడి బ్రిటన్కు వలస వచ్చిన గుజరాతీ సంతతి తల్లిదండ్రులకు జన్మించారు. కన్సర్వేటివ్ పార్టీ ఓటమితో మాజీ ప్రధాని రిషి సునాక్ (44) తాత్కాలిక ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆ పదవికి కొత్త నేత ఎన్నికయ్యే వరకు ఆయనే కొనసాగుతారు. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకత్వం కోసం సొంత పార్టీలో ఇతర ప్రముఖుల నుంచి ప్రీతి పోటీ ఎదుర్కోవాల్సి రావొచ్చు. వారిలో భారత సంతతికి చెందిన సువేలా బ్రేవర్మన్ ఉన్నారు. ప్రీతి గతంలో డేవిడ్ కామెరాన్ ప్రభుత్వంలో భారత సంతతి ప్రతినిధిగా వ్యవహరించారు. కన్సర్వేటివ్ ప్రదాన మంత్రులు థెరెసా మే, బోరిస్ జాన్సన్ ప్రభుత్వాల్లో మంత్రి పదవులు నిర్వహించారు. రిషి సునాక్ ప్రభుత్వం అనుసరిస్తున్న అధిక పన్ను విధానాలను ఆమె విమర్శించేవారు.






