Donald Trump: ట్రంప్ తీరుపై విమర్శలు

ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మే 10వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత ఓ ట్వీట్ చేశారు. దాని ఉద్దేశ్యం.. తక్షణమే శాశ్వత కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించాయని.. అది అమెరికా మధ్యవర్తిత్వం వల్ల సాధ్యమైందని చెప్పారు. ‘‘అమెరికా మధ్యవర్తిత్వలో రాత్రంతా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.. తక్షణమే శాశ్వత కాల్పుల విరమణ చేపట్టేందుకు భారతదేశం, పాకిస్థాన్ అంగీకరించాయి.. సరైన సమయంలో ఇరు దేశాలు విజ్ఞతతో, తెలివిగా వ్యవహరించాయి.. అందుకు ధన్యవాదాలు’’ అని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇదే విషయంలో తన పాత్రనూ కలిపి.. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా చెప్పుకొచ్చారు. తరువాత భారత అధికారులు స్పందిస్తూ పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) 11వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు భారత్ డీజీఎంవో కు ఫోన్ చేశారని.. ఇరు పక్షాలు భూమిపైనా, గాలిలో, సముద్రంలో కాల్పులు, సైనిక చర్యలను సాయంత్రం 5 గంటల నుంచి నిలిపేయాలని అంగీకరించాయని తెలిపారు. మే 12న డీజీఎంవోలు ఇద్దరూ మళ్లీ మాట్లాడతారని విదేశాంగ కార్యదర్శి మిస్రి తరువాత తెలిపారు.
అంతే తప్ప.. ఇదంతా అమెరికా వల్ల, డొనాల్డ్ ట్రంప్ వల్ల జరిగిందనే విషయాన్ని భారత్ ఎక్కడా చెప్పలేదు. అలా అని ట్రంప్ ప్రమేయం లేదని కూడా చెప్పలేదు. ట్రంప్ ప్రస్థావన భారత్ తీసుకురాలేదు. అంటే… ఈ సీజ్ ఫైర్ విషయంలో పాక్ కంటే ఎక్కువగా భారత్‌ను అమెరికా బ్లాక్ మెయిల్ లేదా ఒత్తిడికి గురిచేసిందా అన్న అనుమానం కలిగింది. మరోవైపు పాకిస్థాన్ విదేశాంగశాఖ మంత్రి ఇషాక్ దార్… పాకిస్థాన్, భారత్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయని.. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అంతే తప్ప.. ఇదంతా ట్రంప్ వల్ల అని చెప్పలేదు కానీ… పాక్ ప్రధాని మాత్రం ఈ సీజ్ ఫైర్ అనంతరం ట్రంప్‌కు కృతజ్ఞతలు చెప్పారు.
భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడానికి తమ మధ్యవర్తిత్వమే కారణం అన్ని చెప్పిన ట్రంప్.. ఈ రెండు దేశాల మధ్య ఉన్న మరో వివాదంపై కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా.. వేల సంవత్సరాల నాటి కాశ్మీర్ సమస్యపైనా మద్యవర్తిత్వం వహిస్తానని.. ఇరు దేశాలతో కలిసి కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని వెల్లడిరచారు. దీంతో… ఈ ప్రకటనను పాకిస్థాన్ ప్రధాని స్వాగతించారు. అయితే… భారతదేశం అలాంటి మధ్యవర్తిత్వ ప్రతిపాదనను తిరస్కరించింది. కాశ్మీర్ విషయంలో ఇంక మాట్లాడటానికి ఏమీ లేదని.. పీఓకేను భారత్‌కు అప్పగించడం మాత్రమే మిగిలి ఉందని భారత్ స్పష్టం చేసింది. మరోవైపు… ఏదైనా చేయాలనుకుంటే మీకున్న సామర్థ్యంతో ఉగ్రవాదుల ఏరివేతలో భారత్ కు సహకరించాలని.. అంతే తప్ప, భారత అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టొద్దని మరోవైపు భారతీయులు ట్రంప్‌కు సూచించారు.
చాలా అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య ప్రమాదకరమైన సంఘర్షణను తన ప్రభుత్వ మధ్యవర్తిత్వం వల్ల ముగించడం జరిగిందని.. తాము ఒక అణు యుద్ధాన్ని ఆపామని.. ఆ అణుయుద్ధమే జరిగి ఉంటే లక్షలాది మంది చనిపోయి ఉండేవారని చెప్పిన ట్రంప్… వారితో చాలా వాణిజ్యం చేస్తామని చెప్పి ఒప్పించినట్లు తెలిపారు. తాను వాడినట్లుగా వాణిజ్యాన్ని ఇంకెవ్వరూ ఉపయోగించలేదని ట్రంప్ మరోరోజు చెప్పారు. దీంతో మరోసారి భారత్ స్పందించింది. మే 8న అమెరికా విదేశాంగ మంత్రి రూబియోతో, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడారు.. 9న యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌తో నరేంద్ర మోడీ మాట్లాడారు.. మే 10న మార్క్ రూబియోతో అజిత్ దోవల్ మాట్లాడారు. ఈ మొత్తం చర్చల్లో ఎక్కడా, ఎవరి మధ్యా ‘‘వాణిజ్యం’’ ప్రస్తావనే రాలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి. కాల్పుల విరమణ విషయంలో భారత్ ను ట్రంప్ తనకున్న అధికారాలతోనో, బలంతోనో బలవంతం పెట్టారా..? లేక, పాకిస్థాన్ గురించి చెప్పాల్సినవన్నీ.. ఇరు దేశాలకూ ఆపాదిస్తున్నారా..? ఆ స్థాయి వ్యక్తి ప్రపంచం ముందు ఇలా అసత్యాలు మాట్లాడుతూ.. అమెరికాతో వాణిజ్యం కోసం, భారత్ ఆత్మాభిమానాన్ని, పౌరుషాన్ని తాకట్టు పెట్టుకుందని చెప్పాలనుకుంటున్నారా..? అనే కామెంట్లు వినిపించాయి.
భారత్ తనకు మంచి మిత్రుడనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఉద్రిక్తతల వేళ మాత్రం భారత్.. పాకిస్తాన్ రెండు దేశాల్ని ఒకే గాటున కట్టటం భారతీయులకు, ఎన్నారైలకు రుచించలేదు. పాక్‌ను ట్రంప్ ఎంత పొడిగినా పాక్ మాత్రం అమెరికా వైపు ఉండదని ట్రంప్‌కు తెలుసు. అయినప్పటికీ అమెరికా పాక్ విషయంలో తనకు తాను మిత్రుడిగా చెప్పుకోవటం కనిపిస్తుంది. ఎందుకిలా? అంటే.. పాక్ కు చైనా లాంటి బలమైన మిత్రుడు ఉండటమే. నిజానికి పాకిస్తాన్ లాంటి దేశాన్ని ట్రంప్ లెక్క చేయకూడదు. విలువ ఇవ్వకూడదు. కానీ.. అందుకు భిన్నంగా భారత్ తో సమానంగా పాకిస్తాన్ ను ట్రంప్ చూడటం వెనుక.. వ్యూహాత్మక అంశాలతో పాటు.. చైనాతో ఆ దేశానికి ఉన్న బలమైన బంధమే అని చెప్పాలి. తాజా పరిణామాల అనంతరం అమెరికా కానీ దాని అధ్యక్షుడు ట్రంప్ కు కానీ భారత్ మీదా.. భారతీయుల మీదా ప్రత్యేకంగా ఎలాంటి ప్రేమాభిమానాలు లేవని. వారు మనల్ని.. మన దేశాన్ని వాణిజ్య వస్తువు కిందనే చూస్తున్నారు. అవసరమైతే.. వాణిజ్యాన్ని నిలిపేస్తామని బెదిరిస్తారు కూడా. ఇలాంటి వేళ భారతీయులు కళ్లు తెరవాల్సిన అవసరం ఉంది. భారతీయులు మరింతగా కష్టపడాల్సిన సమయం ఆసన్నమైంది. దేశాన్ని మరింత మెరుగ్గా మార్చేందుకు.. ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వ్యక్తిగత స్థాయిలో ఎవరికి వారు పని చేయాల్సిన అవసరం ఉందని, అమెరికా మీద ఆధారపడే తత్త్వాన్ని వీలైనంతగా తగ్గించుకోవాల్సిన అవసరం తాజా పరిణామాలు మరోసారి గుర్తు చేస్తున్నాయని చెబుతున్నారు.
ట్రంప్‌కు తలుపులు మూసేసిన మోడీ
పహల్గాం ఉగ్రదాడి.. దానికి కౌంటర్‌గా ఆపరేషన్ సిందూర్.. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు పాకిస్తాన్ నోటి నుంచి వచ్చే కాశ్మీర్ మాటకు బదులుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనే పదం బలంగా బయటకు రావటమే కాదు.. ఆ దేశంతో రెండు విషయాల మీద మాత్రమే చర్చలు జరుపుతామని.. అందులో మొదటిది ఉగ్రవాదం.. రెండోది.. పాక్ అక్రమిత కాశ్మీర్ అని స్పష్టంగా తేల్చేశారు. దీంతో.. కాశ్మీర్ అంశం గురించి మాట్లాడటానికి ఏమీ లేదన్న సందేశాన్ని ఇవ్వటమే కాదు.. దాని ప్రస్తావన చేయటాన్ని కూడా తాము అంగీకరించమన్న విషయాన్ని ప్రపంచ దేశాలకు సూటిగా చెప్పేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం రెండు దేశాల మీద మధ్యవర్తిత్వం చేయాలంటే అయితే ఉగ్రవాదం అంతం మీదా.. రెండోది పాక్ అక్రమిత కశ్మీర్ మీదా మాత్రమే అన్నట్లుగా మోదీ చెప్పేశారు. అన్నింటికి మించి ట్రంప్ ‘కాశ్మీర్’కలను కూల్చేయటమే కాదు..మరెప్పటికి మాట్లాడలేని పరిస్థితికి తీసుకొచ్చారు.