Visa: వీసా కోసం ఏడాదికి పైగానే నిరీక్షణ .. రీషెడ్యూలింగ్ కఠినతరం
అమెరికా వీసా(Visa) కలను సాకారం చేసుకోవడానికి ఏడాదికిపైగానే వేచి చూడవలసి వస్తున్నది. ఈ పరిస్థితి విద్యార్థులకు (Students) మాత్రమే కాదు, వ్యాపారులు, పర్యాటకులు (Tourists) వంటి ఇతర రంగాల వారికీ ఎదురవుతున్నది. కొన్ని ప్రాంతాల్లో అపాయింట్మెంట్ వెయిట్ టైమ్ ఓ సంవత్సరానికి మించిపోతున్నది. రీషెడ్యూలింగ్ (Rescheduling) మరింత కఠినమవుతున్నది. ఇక ఇంటర్వ్యూలు అత్యంత సూక్ష్మ వివరాలతో కఠినతరమయ్యాయి. దేశంలోని పశ్చిమ ప్రాంతాల వారికి వీసా అపాయింట్మెంట్ దొరకాలంటే ఏడాదిన్నర పడుతున్నది లేదా 2026 చివరికి పోతున్నది. దేశంలోని ఉత్తరాది, దక్షిణాది, తూర్పు ప్రాంతాల వారికి దాదాపు ఓ సంవత్సరంలో అపాయింట్మెంట్ దొరుకుతున్నది.
మే నెల నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం అమెరికా (America) వీసా కోసం దరఖాస్తుదారు తనకు కేటాయించిన సమయానికి హాజరుకాలేకపోతే, కొత్త అపాయింట్మెంట్ను 120 రోజలు వరకు బుక్ చేసుకోవడానికి వీలుకాదు. ఇది ఇంటర్వ్యూ (Interview) కు, ఇంటర్వ్యూ-వెయివర్ అపాయింట్మెంట్స్కు వర్తిస్తుంది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు తమ అపాయింట్మెంట్ను కేవలం ఒకసారి మాత్రమే రీషెడ్యూల్ చేసుకోవచ్చు. గతంలో రెండుసార్లు రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉండేది.







