China : అమెరికా చర్యను ఖండించిన చైనా
కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్నాయన్న నెపంతో తమ విద్యార్థుల వీసా (Student visa) లను రద్దు చేసిన అమెరికా చర్యను చైనా (China) ఖండించింది. ఇది ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసే రాజకీయం ప్రేరేపిత వివక్షతో కూడిన చర్యని పేర్కొంది. ఈ అంశంపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో (Marco Rubio) చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ (Mao Ning) తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై చైనా అమెరికా (America) లో ఉన్న తమ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. అమెరికా చెప్పుకునే స్వేచ్ఛ, నిష్కపట విలువలు బూటకమని వ్యాఖ్యానించారు. ఇది అమెరికా ప్రతిష్టను, విశ్వసనీయతను మరింత దెబ్బతీస్తుందన్నారు. జాతీయ భద్రత సాకుతో చైనా విద్యార్థుల వీసాలను అన్యాయంగా రద్దు చేయడం వారి చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసింది. రెండు దేశాల మధ్య సాధారణ ప్రజల మధ్య రాకపోకలకు కూడా అంతరాయం కలిగిస్తుంది. ఈ చర్యలను చైనా గట్టిగా వ్యతిరేకిస్తుంది అని ప్రకటించారు.







