Tokyo: జపాన్ ఫైటర్ జెట్స్ కు చైనా రాాడార్ లాకింగ్… డ్రాగన్ సాంకేతిక యుద్ధం..!
వన్ చైనా ప్రిన్సిపల్ తో దుందుడుకుగా వ్యవహరిస్తున్న చైనా .. ఆ వ్యవహారంలో ఎవరు జోక్యం చేసుకున్నా ఊరుకోనని వార్నింగులిస్తోంది. తైవాన్ పై చైనా దురాక్రమణకు దిగితే.. తాము రంగంలోకి దిగే అవకాశముందని జపాన్ ప్రధాని సనాయే టకాయితీ సంచలన వ్యాఖ్యలు చేసిన తరుణంలో.. చైనా ఏకంగా జపాన్ ఫైటర్ జెట్స్ కు రాడార్ లాకింగ్ చేసింది. ఈపరిణామాలపై జపాన్ ఆందోళన వ్యక్తంచేసింది కూడా.
జపాన్, చైనా సైన్యాల మధ్య శనివారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తమ దేశానికి చెందిన రెండు ఎఫ్-15 యుద్ధవిమానాలను చైనా జెట్లు రాడార్ లాక్ చేశాయని జపాన్ రక్షణమంత్రి షింజిరో కొయ్‌జుమి వెల్లడించారు. క్షిపణిని శత్రు విమానాలపైకి ప్రయోగించే ముందు ఈ ప్రక్రియను అవలంబిస్తారు. సాధారణ సమయాల్లో ఇలాంటి చర్యకు పాల్పడం అత్యంత దుందుడుకు చర్య అని నిపుణులు పేర్కొన్నారు. ‘‘ఓకినావా తీరానికి దగ్గర్లో చైనా నేవీకి చెందిన జె-15 విమానాలు గాల్లోకి ఎగిరాయి. మా యుద్ధ విమానాలు సరిహద్దుల్లోనే ఉంటూ వాటిని గమనిస్తున్నాయి. ఇంతలో వారు రాడార్ లాక్ చేసినట్లు హెచ్చరిక అందింది. ఇలా వెంటవెంటనే రెండుసార్లు జరిగింది. ఈ ఘటనపై చైనా అధికారులకు మా అసంతృప్తిని తెలియజేశాం’’ అని షింజిరో వివరించారు.
దీనిపై చైనా అధికార ప్రతినిధి వాంగ్ గ్జూమెంగ్ స్పందించారు. జపాన్ విమానాలు తమను పదేపదే ‘వేధిస్తుండటం’తో నిబంధనలకు లోబడే హెచ్చరించామని అన్నారు. తమ విన్యాసాల గురించి ముందే ప్రకటించామని పేర్కొన్నారు. ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా రక్షణమంత్రి రిచర్డ్ మార్లెస్ ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. తైవాన్‌పై చైనా దురాక్రమణ చేస్తే తాము రంగంలోకి దిగే అవకాశముందని జపాన్ ప్రధాని సనాయే టకాయిచి ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
– Srinivasa Mohan






