Trump: ట్రంప్ కు తొలి ఫిఫా శాంతి బహుమతి..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎట్టకేలకు శాంతి బహుమతి అందుకున్నారు. ఆవిధంగా ఆయన కల నెరవేరింది. అయితే అది నోబెల్ శాంతి బహుమతి కాదు.. ఫిఫా శాంతి బహుమతి. అదేంటి..? ఫిఫా అంటే ఫుట్ బాల్ ప్రపంచకప్ కు సంబంధించింది కదా అని డౌటొచ్చిందా..? అవును.. ఆ సంస్థే.. ట్రంప్ కు.. తొలి ఫిఫా శాంతి బహుమతి అందించింది.
2026లో జరగనున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ (FIFA World Cup 2026) పోటీలకు సంబంధించి వాషింగ్టన్ డీసీలోని కెన్నడీ సెంటర్లో డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరించారు. దీనికి ట్రంప్ హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు తొలి ‘ఫిఫా శాంతి బహుమతి’ని ప్రకటిస్తున్నట్లు ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో పేర్కొన్నారు. దీంతో ఈ శాంతి బహుమతి కాస్త రాజకీయ రంగు పులుముకుంది.
ప్రపంచ ఫుట్‌బాల్ బాడీ అయిన ఫిఫా ఈ ఏడాది నుంచే తొలిసారి శాంతి బహుమతిని ఇవ్వనున్నట్లు నవంబర్ 5న ప్రకటించింది. ఇది ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఏకం చేస్తుందని పేర్కొంది. ఫిఫాకు ఇదొక గుర్తింపుగా వర్ణించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా శాంతి స్థాపన కోసం తీవ్రంగా శ్రమించే వారికి, తన చర్యలతో ప్రపంచాన్ని ఏకం చేసే వారికి ఈ బహుమతిని అందజేయనున్నట్లు ఫిఫా ప్రకటించింది. అంతేకాకుండా ఈ బహుమతి ఫిఫా గౌరవాన్ని మాత్రమే పెంచదని, 500 కోట్ల మంది ఫుట్‌బాల్ అభిమానుల తరఫున అందజేసేదిగా గియాని అభివర్ణించారు.
తొలి అవార్డు ట్రంప్‌నకే..
ఫిఫా ప్రపంచకప్ 2026 డ్రా కార్యక్రమంలో ‘ఫిఫా శాంతి బహుమతి’ని ట్రంప్‌నకు గియానీ ప్రకటించారు. దీంతో బంగారు పతకాన్ని ట్రంప్ అందుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడిని గియాని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచ దౌత్యంలో ట్రంప్ పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. ఎన్నో యుద్ధాలను ఆయన ఆపారని తెలిపారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ఈ అవార్డు పొందడం తన జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఒకటన్నారు. అవార్డులతో సంబంధం లేకుండా నా దౌత్యంతో లక్షలాది మంది ప్రాణాలను కాపాడాను. కాంగో శాంతి ఒప్పందమే అందుకు ఉదాహరణ. కాంగో-రువాండా మధ్య హింసతో 10 మిలియన్ల మంది చనిపోయారు. మరో 10 మిలియన్ల మంది చావు అంచుల్లో ఉన్నారు. ప్రాణనష్టాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టాను. ఇది ఎంతో గర్వకారణం. అంతేకాకుండా ఇండియా-పాకిస్థాన్ యుద్ధాన్ని సైతం నేనే ఆపాను. నా చర్యలతో ఎన్నో దేశాల మధ్య యద్ధాలు ఆగిపోయాయి. ఇంకొన్ని దేశాల్లో యుద్ధం ప్రారంభం కాకముందే ముగిశాయి’’ అని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
శాంతి బహుమతిపై విమర్శలు..
ట్రంప్‌నకు ఫిఫా బాడీ శాంతి ప్రకటించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. హ్యూమన్ రైట్ వాట్ సంస్థ ఫిఫాపై బహిరంగాంగానే విమర్శలు గుప్పించింది. అవార్డు ఎంపికపై పారదర్శకత పాటించలేదని, నామినీలు, జూరీ సభ్యులు లేరని పేర్కొంది. ఫిఫా కౌన్సిల్లోనూ ఇది వార్తగా నిలిచినట్లు తెలిపింది.






