Vemireddy: జగన్ విమర్శలకి వేమిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..
వైసీపీ (YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై నెల్లూరు (Nellore) ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) మొదటిసారి స్పష్టంగా, తీవ్రంగా స్పందించారు. ఇంతకాలం వ్యక్తిగత విమర్శలు చేయకుండా ఉన్న వేమిరెడ్డి, ఈసారి మాత్రం బహిరంగ వేదిక పైనే జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద సవాల్ విసరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
వేమిరెడ్డి గతంలో వైసీపీలో ఉన్నప్పటి పరిస్థితులను గుర్తుచేసుకుంటూ, 2024 ఎన్నికలకు ముందు తనకి , తన భార్యకు రెండు స్థానాలు కావాలని కోరుకున్నానని తెలిపారు. కానీ ఆ సమయంలో జగన్ మాత్రం ఎంపీ స్థానం ఒక్కటే ఇస్తానని చెప్పడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగి చివరకు ఆయన టీడీపీ (TDP) లో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీలో చేరిన తరువాత రెండు స్థానాలు దక్కించుకుని, భార్యాభర్తలు విజయాలు సాధించారు. అయినప్పటికీ, వేమిరెడ్డి కుటుంబం నేరుగా జగన్‌పై వ్యాఖ్యలు చేయకుండా ఇప్పటిదాకా కాస్త దూరం పాటించింది.
కానీ తాజాగా నెల్లూరులో జరిగిన సమావేశంలో వేమిరెడ్డి, జగన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచివేశాయని తెలిపారు. తిరుమల లడ్డూ (Tirumala Laddu) కేసులో అరెస్టయిన వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) పీఏ చిన్న అప్పన్న (Chinna Appanna)కి తన చేతుల మీదుగా 50 వేల రూపాయలు ఇచ్చిన విషయం నిజమని చెప్పారు. కానీ అది పూర్తిగా మానవతా దృక్పథంతో చేసిన సహాయం మాత్రమేనని స్పష్టం చేశారు. అప్పన్న కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని, అందుకే సాయం చేశానని వివరించారు.
ఇటీవలి రోజుల్లో జరిగిన మీడియా సమావేశంలో జగన్, చిన్న అప్పన్నకు 4.5 కోట్ల రూపాయల అక్రమ డబ్బు ఉన్నట్లు సూచిస్తూ, వేమిరెడ్డి కూడా అతనికి డబ్బులు ఇచ్చారని ప్రస్తావించడంతో, ఈ వ్యాఖ్యలే తనను బాధపెట్టాయని వేమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై అనవసరమైన అనుమానం కలిగే విధంగా మాట్లాడటం తగదని ఆయన పేర్కొన్నారు.
‘‘నేను చేసిన సహాయం వెనుక ఎలాంటి తప్పుదారి ఆలోచన లేదు. రాజకీయంగా నన్ను చెడుగా చూపేందుకు జగన్ ఎలా అనిపిస్తే అలా మాట్లాడారు’’ అని వేమిరెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పష్టత కోసం జగన్ దేవుడి ముందు ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. అప్పన్న కేసులో బయటపడుతున్న ఆర్థిక వివరాల వల్ల రాజకీయంగా అనేక అనుమానాలు, ఆరోపణలు బయటకు వస్తున్న సమయంలో వేమిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి వైసీపీ–టీడీపీ మధ్య ఉద్రిక్తత పెంచేలా కనిపిస్తున్నాయి. ఇక జగన్ ఈ సవాల్‌కు ఎలా స్పందిస్తారో ఇప్పుడు అందరి దృష్టి అక్కడే నిలిచింది.
– Bhuvana






