Jai Shankar: ఇండియాలో ఎన్నాళ్లుంటారన్నది హసీనా నిర్ణయం మేరకే అన్న భారత్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా.. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని నిర్ధారిస్తూ.. డాకాలోని ప్రత్యేక ట్రైబ్యునల్ గత నెలలో మరణశిక్ష విధించింది. ఆమెను తమ దేశానికి అప్పగించాలని బంగ్లాదేశ్ పలుమార్లు డిమాండ్ చేసింది. ఆమెకు ఆశ్రయం ఇవ్వడం.. రెండు దేశాల సంబంధాలను దెబ్బతీస్తుందని అక్కడి మంత్రులు, అధికార యంత్రాంగం ప్రకటనలు సైతం చేసింది. ఇలాంటి తరుణంలో భారత్ ఏం చేస్తుందో అన్న అనుమానాలు అందరిలోనూ తలెత్తాయి. అయితే వీటికి భారత్ తనదైన రీతిలో సమాధానమిచ్చింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఉండటం పూర్తిగా ఆమె వ్యక్తిగత నిర్ణయమని, ఆమె దేశానికి రావడానికి దారితీసిన ‘ప్రత్యేక పరిస్థితులే’ ఈ విషయంలో కీలక పాత్ర పోషించాయని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. హెచ్‌టీ లీడర్షిప్ సమ్మిట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌లో జరిగిన భారీ హింసాత్మక ఘటనల నేపథ్యంలో, 15 ఏళ్ల పాటు సాగిన షేక్ హసీనా పాలన ముగిసింది. ఆ సమయంలో ఆమె భారత్‌కు పారిపోయి వచ్చారు. కాగా, గతేడాది జరిగిన విద్యార్థి నిరసనలపై ఆమె ప్రభుత్వం క్రూరంగా వ్యవహరించిందన్న ఆరోపణలతో, ‘మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు’ పాల్పడ్డారని నిర్ధారిస్తూ ఢాకాలోని ప్రత్యేక ట్రైబ్యునల్ గత నెలలో ఆమెకు మరణశిక్ష విధించింది.
బంగ్లాదేశ్‌లో విశ్వసనీయమైన ప్రజాస్వామ్య ప్రక్రియ జరగాలన్నదే భారత్ వైఖరి అని జైశంకర్ స్పష్టం చేశారు. “బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పాలకులు గత ఎన్నికల విధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎన్నికలే సమస్య అయితే, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడమే మొదటి ప్రాధాన్యత కావాలి. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ఏర్పడిన ప్రభుత్వం ఇరు దేశాల సంబంధాలపై సమతుల్య దృక్పథంతో ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను” అని ఆయన అన్నారు.






