Paris: స్బెయిన్ బుల్ అల్కరాస్ దే ఫ్రెంచ్ ఓపెన్ 2025 ట్రోఫీ
అసలు సిసలైన చాంపియన్ ఎలా ఉంటాడన్నది కళ్లముందే చేసి చూపించాడు అల్కరాస్ (Carlos Alcaraz) . ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తన ప్రత్యర్థి , ప్రపంచ నెంబర్ 1 …సినర్ (Jannik Sinner) పై అద్భుత విజయాన్ని సాధించాడు. ఇద్దరు కొదమ సింహాల్లో కోర్టులో కలియదిరుగుతూ చివరికంటా పోరాడారు. అయితే చివరిలో అల్కరాస్.. తన అపార ప్రతిభను ప్రదర్శించి, సినర్ సర్వీస్ బ్రేక్ చేసి గేమ్ పాయింట్ తో పాటు మ్యాచ్ చేజిక్కించుకున్నాడు.
ఆదివారం రసవత్తరంగా సాగిన ఫైనల్లో అతడు 4-6, 6-7 (4-7), 6-4, 7-6 (7-3), 7-6 (10-2)తో టాప్ సీడ్ యానిక్ సినర్ (ఇటలీ)పై చిరస్మరణీయ విజయం సాధించాడు. తొలి రెండు సెట్లు కోల్పోయాక, నాలుగో సెట్లో 3-5 (0-40)తో నిలిచాక ఇక ఓటమి తప్పదనే స్థితిలో నిలిచాక అల్కరాస్ పుంజుకున్న తీరు స్ఫూర్తిదాయకం. 5 గంటల 29 నిమిషాల పాటు సాగిన ఈ ఫైనల్.. రొలాండ్ గారోస్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన ఫైనల్‌గా రికార్డులకెక్కింది. కెరీర్లో అల్కరాస్‌కు ఇది అయిదో గ్రాండ్‌స్లామ్ టైటిల్. అతడికిది రెండో ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీ.
ఇద్దరూ గట్టిగా పోరాడడంతో తొలి సెట్ హోరాహోరీగా సాగింది. మూడో గేమ్‌లో బ్రేక్ సాధించేందుకు అల్కరాస్‌కు చక్కని అవకాశం చిక్కింది. కానీ 15-40తో వెనుకబడ్డా.. సినర్ బలంగా పుంజుకుని సర్వీసును నిలబెట్టుకున్నాడు. కానీ అల్కరాస్ అయిదో గేమ్‌లో బ్రేక్‌తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అయితే అతడి ఆనందాన్ని సినర్ ఎంతో సేపు నిలునివ్వలేదు. తర్వాతి గేమ్‌లోనే బ్రేక్ సాధించి స్కోరు సమం చేశాడు. ప్రతి పాయింట్ కోసం ఇద్దరూ హోరాహోరీగా తలపడుతుండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఇద్దరూ 4-4తో సమంగా నిలిచారు. తొమ్మిదో గేమ్‌లో అలవోకగా సర్వీసు నిలబెట్టుకున్న సినర్ 5-4తో నిలిచాడు. కీలకమైన తొమ్మిదో గేమ్‌లో అల్కరాస్ తడబడ్డాడు. అతడి సర్వీసును బ్రేక్ చేసిన సినర్ సెట్‌ను చేజిక్కించుకున్నాడు. అంతకు కొద్దిసేపు ముందు కుడి కంట్లో ఏదో సమస్య తలెత్తడం అల్కరాస్ లయను దెబ్బతీనట్లుగా కనిపించింది. రెండో సెట్లోనూ సినర్ పైచేయిని కొనసాగించాడు.
రెండో గేమ్‌లోనే బ్రేక్ సాధించిన అతడు.. తర్వాత సర్వీసు నిలబెట్టుకుని 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత 5-3తో నిలిచాడు. కానీ కీలక సమయంలో అల్కరాస్ పుంజుకున్నాడు. సెట్ కోసం సినర్ సర్వ్ చేయగా.. అల్కరాస్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత సర్వీసు నిలబెట్టుకుని 5-5తో సమంగా నిలిచాడు. క్రమంగా సెట్ టైబ్రేక్‌కు దారితీసింది. అక్కడ పైచేయి సాధించిన సినర్.. రెండో సెట్‌ను కూడా కైవసం చేసుకున్నాడు. అయితే వరుస సెట్లలో మ్యాచ్‌ను కోల్పోయే ప్రమాదంలో పడ్డ అల్కరాస్ మ్యాచ్‌లో అద్భుతంగా పుంజుకున్నాడు. మూడో సెట్ కూడా ఆటగాళ్ల పరస్పర బ్రేకులతో ఆసక్తికరంగా సాగింది. కానీ పూర్తి భిన్నంగా కనిపించిన అల్కరాస్.. ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. తొలి గేమ్‌లోనే సర్వీసు చేజార్చుకున్నా కోలుకున్న అతడు.. రెండు, నాలుగో గేముల్లో బ్రేకులతో 4-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అల్కరాస్ అలవోకగానే సెట్ సొంతం చేసుకుంటాడని భావించారంతా. కానీ సెట్ కోసం సర్వ్ చేస్తూ 9వ గేమ్‌లో సర్వీసు కోల్పోయాడు. కానీ తర్వాతి గేమ్‌లోనే బ్రేక్ సాధించిన అల్కరాస్.. సెట్‌ను గెలుచుకుని, మ్యాచ్‌లో ఆశలను సజీవంగా ఉంచుకున్నాడు.
ఓటమి అంచుల్లో నుంచి..: మూడో సెట్ వైఫల్యం నుంచి కోలుకున్న సినర్.. నాలుగో సెట్లో దూసుకుపోయాడు. ఆటగాళ్లిద్దరూ నువ్వా నేనా అన్నట్లు తలపడడంతో ఏడో గేమ్ వరకు సెట్ ఎలాంటి బ్రేక్ లేకుండా సాగింది. కానీ ఏడో గేమ్‌లో బ్రేక్ సాధించిన సినర్, ఆ వెంటనే సర్వీసు నిలబెట్టుకుని పట్టుబిగించాడు. ఆపై 9వ గేమ్‌లో అల్కరాస్ సర్వీసు చేస్తుండగా సినర్ 40-0తో నిలిచాడు. ఇక ఒక్క పాయింటు సాధిస్తే ఖాతాలో టైటిల్. కానీ కథ అక్కడే అనూహ్యంగా మలుపు తిరిగింది. అల్కరాస్ అద్భుతమే చేశాడు. గొప్ప పోరాటంతో మూడు ఛాంపియన్షిప్ పాయింట్లను కాచుకున్న అతడు.. ఆ వెంటనే సినర్ సర్వీసును బ్రేక్ చేసి స్కోరును 5-5తో సమం చేశాడు. సెట్ చివరికి టైబ్రేక్‌కు దారితీసింది. అక్కడ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అల్కరాస్.. సెట్ గెలిచి, మ్యాచ్‌ను నిర్ణయాత్మక సెట్‌కు తీసుకెళ్లాడు. ఆఖరి సెట్ కూడా నువ్వానేనా అన్నట్లు సాగింది. ఇద్దరూ 6-6తో నిలవడంతో ఆట సూపర్ టై బ్రేక్‌కు దారితీసింది. ఒత్తిడిని తట్టుకుంటూ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి అల్కరాస్.. టైబ్రేక్‌లో 10-2తో నెగ్గి, విజేతగా నిలిచాడు.
అల్కరాస్-సినర్ మధ్య మ్యాచ్ ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో సుదీర్ఘంగా సాగిన (5 గంటల 29 నిమిషాలు) సింగిల్స్ ఫైనల్‌గా నిలిచింది. 1982లో మాట్స్ విలాండర్-విలాస్ (4 గంటల 42 నిమిషాలు) నెలకొల్పిన రికార్డు కనుమరుగైంది. నాదల్, గుస్తావో కుయెర్టన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌ను నిలబెట్టుకున్న ఘనత అల్కరాస్‌దే. అల్కరాస్‌కు ఇది అయిదో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్. ఇంతకుముందు అతను 2023, 2024 వింబుల్డన్, 2024 ఫ్రెంచ్ ఓపెన్, 2022 యుఎస్ ఓపెన్ టైటిళ్లు సాధించాడు.







