కీలక బిల్లును ఆమోదించిన ఆస్ట్రేలియా సెనెట్
చిన్నారులు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధించడానికి ఉద్దేశించిన బిల్లును ఆస్ట్రేలియా సెనెట్ ఆమోదించింది. ప్రతినిధుల సభ దీనికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో త్వరలో ఇది చట్టరూపంలోకి రానుంది. 16 ఏళ్ల లోపు చిన్నారులను సామాజిక మాధ్యమాల నుంచి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో ఈ బిల్లును తీసుకువచ్చిన విషయం తెలిసిందే. చిన్నారులు సామాజిక మాధ్యమాలను వినియోగించకుండా నియంత్రించని సంస్థలకు 50 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు ( సుమారు రూ.273 కోట్లు ) జరిమానా విధించనున్నారు. టిక్‌టాక్, ఫేస్బుక్, స్నాప్‌చాట్, రెడిట్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాద్యమ వేదికలకు ఈ చట్టం వర్తించనుంది.






