Pakistan: అవినీతి, బంధుప్రీతి.. నిరంకుశత్వం.. పాక్ ఆర్థిక సంపద సైన్యం పాలు..?

పాకిస్తాన్ (Pakistan) సైన్యాన్ని చూసి గతంలో ఆదేశ పౌరులు గర్వించేవాళ్లు.. ఎప్పుడు ఎవరు మాట్లాడినా మా సైన్యం ముందు భారత్ సైన్యం దిగదుడుపే అన్నట్లు వారి భావనలు ఉండేవి. అయితే క్రమంగా అవి సన్నగిల్లుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఆ భావన మరింత పెరిగింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత సిందూర్ ఆపరేషన్.. పాక్ ప్రజల్ని ఆందోళనకు గురిచేసింది. దీనికి తమ సైన్యం సరైన సమాధానమివ్వలేదన్న భావన పాకిస్తానీయుల్లో వ్యక్తమవుతోంది.
వాస్తవానికి పాకిస్తాన్ సైనికాధికారులు.. అవినీతి పర్వానికి కొమ్ము కాస్తూ వస్తున్నారు. వ్యాపార సామ్రాజ్యాలు నడుపుతూ వీరు సాగిస్తున్న దందాతో దేశం దివాళా అంచుకు చేరింది. ఈ జనరళ్లు కోట్లకు పడగలెత్తారు. పోరాటం చేసే బాధ్యతను ఉగ్రవాదులకు అప్పగించేసి రాజప్రాసాదాలను తలపించే భవనాల్లో విలాసాల్లో జోగుతున్నారు. మరోవైపు సాధారణ పాక్ ప్రజలు కనీస అవసరాలు తీరే దిక్కులేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారత్‌ను బూచిగా చూపుతూ పాకిస్థాన్‌ను అక్కడి సైన్యం కబంధ హస్తాల్లో బిగించింది. సైనిక ఉన్నతాధికారులు ఏళ్ల తరబడి ఆ దేశాన్ని ప్రత్యక్షంగా పాలించారు. మిగతా సమయంలోనూ వారిదే పెత్తనం. ప్రజాస్వామ్య ప్రభుత్వం అక్కడ నామమాత్రం.
దీర్ఘకాల రాజకీయ అనిశ్చితి, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ కారణంగా పాకిస్థాన్ నలిగిపోతోంది. అధిక ధరలు, ఆర్థిక సంక్షోభం వల్ల సగటు పాక్ జాతీయుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. విదేశీ అప్పు 126 బిలియన్ డాలర్లు దాటిపోయింది. అప్పులు తీర్చడానికి దేశ బడ్జెట్‌లో 40 శాతం సొమ్ము సరిపోతోంది. ఆకలి సూచీలో పాక్ ఎక్కడో అట్టడుగున ఉంది. దేశ జనాభాలో దాదాపు 40 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. బలోచిస్థాన్‌లో పరిస్థితి మరీ దారుణం. సహజవాయువు, ఖనిజాల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ రాష్ట్రం తోడ్పాటును అందిస్తున్నప్పటికీ అక్కడ 70 శాతం మంది పేదరికంలో ఉన్నారు. ఇది వేర్పాటువాద ఉద్యమాలకు ఊతమిస్తోంది. పాక్‌లో గత కొన్నేళ్లుగా ఆర్థిక వృద్ధిరేటు 2.4 శాతానికే పరిమితమైంది. విదేశీ మారకనిల్వలు దారుణంగా పడిపోయాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఇచ్చే ఉద్దీపన ప్యాకేజీలు, కొన్ని దేశాలు ఇస్తున్న రుణాలతో పాక్ నెట్టుకొస్తోంది.
దేశ ప్రజలు ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే.. ఒక వ్యవస్థ ప్రస్థానం మాత్రం నిత్య కల్యాణం.. పచ్చతోరణంలా సాగిపోతోంది. అదే ఆ దేశ సైన్యం! ఇది ఒట్టి మిలిటరీ శక్తి మాత్రమే కాదు.. తిరుగులేని కార్పొరేట్ సంస్థ. రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, అగ్రిబిజినెస్, తయారీ, మీడియా, సరకుల రవాణా వంటి కీలక రంగాల్లో భారీగా ఆర్జిస్తోంది. ప్రత్యేక మినహాయింపులు, భూ ఆర్డినెన్స్‌ల ద్వారా ఈ దందాను చట్టబద్ధం చేసుకుంది. ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థను నడుపుతోంది.
పాకిస్థాన్ సైన్యంలోని కార్పొరేట్ సామ్రాజ్య పునాదులు భిన్న ఫౌండేషన్లలో ఉన్నాయి. ఇవి పాక్షిక ప్రభుత్వ వ్యవస్థలు. ప్రస్తుత, మాజీ సైనిక ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. మాజీ సైనికోద్యోగుల సంక్షేమం కోసం ఛారిటీ సంస్థల్లా వీటిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వ్యాపార సామ్రాజ్యాలుగా మారాయి.
పాక్ సైనికదళాల ఆధ్వర్యంలోని సంస్థలు ఫక్తు వ్యాపారం నిర్వహిస్తున్నప్పటికీ చాలాచోట్ల వీటికి పోటీ ఉండదు. అంతా గుత్తాధిపత్యమే. జవాబుదారీతనం మచ్చుకైనా కనిపించదు. వీటి ఆర్థిక అంశాలపై పరిశీలన ఉండదు. పైపెచ్చు భారీగా పన్ను మినహాయింపులు ఉంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు లభిస్తాయి.ఈ వ్యాపారాల్లో ఆర్జించిన సొమ్ములో సింహ భాగం.. సైనిక ఉన్నతాధికారుల జేబుల్లోకి వెళ్లిపోతుంది. దేశాభివృద్ధికి, దిగువస్థాయి సైనికులకు వెళ్లేది నామమాత్రం. ఈ వాణిజ్య సామ్రాజ్యాన్ని రాజకీయ పెత్తనం కోసం ఒక వేదికగా సైన్యం వాడుకుంటోంది. నచ్చిన రాజకీయ పార్టీలకు నిధులు అందేలా చూడటం, వ్యతిరేక పార్టీలకు డబ్బు కట్టడి చేయడం వంటి చర్యలకు పాల్పడుతోంది.