జర్మనీ మాజీ ఛాన్సలర్‌కు క్షమాపణలు చెప్పిన పుతిన్!
రష్యా అధ్యక్షుడు పుతిన్ జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌కు క్షమాపణలు చెప్పారు. 2007లో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తో సమావేశమైన పుతిన్ తనతో పాటు తన పెంపుడు శునకం లాబ్రడార్‌ను తీసుకెళ్లారు. ఆ సమయంలో తాను అసౌకర్యానికి గురైనట్లు మెర్కెల్ ఇటీవల తెలిపారు. దీనిపై పుతిన్ స్పందిస్తూ మెర్కెల్‌ను భయపెట్టడం తన ఉద్దేశం కాదని, ఆవిధంగా చేసినందుకు తనను క్షమించాలని ఆమెను కోరారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న మెర్కెల్ తనకు శునకాలంటే భయమని తెలిపారు. 2007లో తాను జర్మనీ ఛాన్సలర్‌గా ఉన్నప్పుడు ఓ సమావేశానికి పుతిన్ తన పెంపుడు శునకాన్ని తీసుకువచ్చారని, దీంతో తాను భయపడ్డానని, అక్కడ ఉన్నంతసేపు అసౌకర్యానికి గురయ్యానని పేర్కొన్నారు. అయితే పుతిన్‌కు కుక్కలంటే చాలా ఇష్టమని, పలు సందర్భాల్లో కొందరు దేశాధ్యక్షులు ఆయనకు వాటిని బహుమతిగా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.






