బ్రెజిల్లో అమెరికా మోడల్ కుటుంబం కిడ్నాప్!
అమెరికాకు చెందిన ఓ మోడల్‌ను, ఆమె కుటుంబసభ్యులను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. బ్రెజిల్‌లోని ఓ రెస్టారంట్లో కిడ్నాప్ చేసిన దుండగులు దాదాపు 12 గంటలపాటు ఓ గుడిసెలో బంంధించినట్లు తెలుస్తోంది. బ్రెజిల్‌కు చెందిన లియా కర్టిస్ ప్రస్తుతం తన భర్త హెన్రిక్ జెండ్రే, ఇద్దరు పిల్లలతో న్యూయార్క్‌లో నివాసముంటున్నారు. ఈ నెల 27న తన కుటుంబంతో కలిసి బ్రెజిల్‌లోని సావో పాలోలోని ఓ రెస్టారంట్లో ఉండగా, కొందరు దుండగులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే గన్‌తో బెదిరించి ఆమెను, ఆమె భర్త, వారి 11 ఏళ్ల కుమార్తెని కిడ్నాప్ చేశారు. అకౌంట్ల నుంచి డబ్బులు బదిలీ చేయాలని దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే మోడల్ పెద్ద కుమార్తె తల్లిదండ్రులు ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపుచర్యలు చేపట్టారు. అయితే, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే దుండగులు వారిని విడిచిపెట్టి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






