America:మీరు రష్యాతో వ్యాపారం చేయొచ్చా?.. అమెరికాను ప్రశ్నించిన చైనా

రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై భారీగా సుంకాలు విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదేపదే హెచ్చరికలు చేస్తుండటంపై చైనా (China) స్పందించింది. వాస్తవానికి రష్యా (Russia) తో అమెరికానే వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తోందని ఐక్యరాజ్యసమితిలోని బీజింగ్ డిప్యూటీ శాశ్వత ప్రతినిధి గెంగ్ ఘవాంగ్ (Geng Gwang) పేర్కొన్నారు. అమెరికా హెచ్చరికలపై ఆయన మాట్లాడుతూ ఐరాస భద్రతా మండలిలో ఉక్రెయిన్ (Ukraine) కు ఆయుధ సరఫరాల అంశంపై చర్చ సమయంలో అమెరికా ప్రతినిధి చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పినట్లు తమ దేశం రష్యాకు ఎలాంటి ఆయుధాలను అందించలేదని స్పష్టం చేశారు. రష్యాతో పాటు ఉక్రెయిన్‌తో కూడా సాధారణ వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నామన్నారు. అవి అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఉన్నాయని, ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదన్నారు. వాస్తవానికి అమెరికా (America) నే ఇప్పటివరకు రష్యాతో వాణిజ్య కొనసాగించిందని విమర్శించారు. ఇతరులు వాణిజ్య సంబంధాలు కొనసాగించకూడదు కానీ, మీరు చేయొచ్చా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో సంక్షోభం కీలక దశలో ఉందని, దాని పరిష్కారానికి ఇది సరైన సమయమని అభిప్రాయపడ్డారు. ఇతరులపై నిందలు వేసి బలిపశులను చేయడం మాని, కాల్పుల విరమణ కీవ్‌లో శాంతి నెలకొల్పడం అనే అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు.