AI: యాంబియెంట్ కంప్యూటింగ్… బతుకుచిత్రంలో ఏఐ మాయ..
ఏఐ(AI) కాలమిది.. ఊహించని మార్పులతో ప్రపంచం అప్ డేట్ అవుతోంది. చిన్న ఫోటో అప్ డేట్ చేస్తే చాలా మీ ఫేస్ పాటలు పాడేస్తుంది. ప్రస్తుతం బతికిలేని మహనీయులు కూడా జీవించినట్లు మనల్ని భ్రమింప చేస్తోంది. ఈ టెక్నాలజీ రాకతో వామ్మో ఏమి అభివృద్ధి ఇది అందరూ నోరు వెళ్లబెడుతున్న పరిస్థితి. మరి అలాంటిది ఆ ఏఐని సర్వ వ్యాప్తం చేస్తే..అన్నింటినీ కలిపి , వాటి ఫలాలు అందుబాటులోకి తెస్తే.. అదే యాంబియెంట్ కంప్యూటింగ్ (Ambient computing)..
అసలీ యాంబింయెంట్ కంప్యూటింగ్ అంటే…
మీరు మీ షెడ్యూల్ కోసం ఇప్పుడు చాలా ఎక్విప్ మెంట్ పై ఆధారపడుతున్నారు. గతంలో అయితే స్టాప్ వాచ్, అలారంపై ఆధారపడితే.. ఇప్పుడు కంప్యూటర్, మరీ చెప్పాలంటే అలెక్సా లాంటి యాప్స్ పై ఆధారపడుతున్నారు. అయితే ఇలా అన్నింటిపైనా ఆధారపడకుండా.. వాటన్నంటిలో ఏఐని నిక్షిప్తం చేసి, ఓ వ్యవస్థను రూపొందిస్తే.. అదే మీ అసిస్టెంట్ లా పనిచేస్తుంది. మీ ప్రమేయం లేకుండానే మీకు కావాల్సిన అన్ని పనులు సకాలంలో గుర్తు చేసి మరీ కంప్లీట్ చేయిస్తుంది.
వారం రోజుల్లో మా అమ్మాయి పెళ్లి ఉంది రమ్మని మీ బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పారు… ఇప్పుడైతే ఏ డైరీలోనో రాసుకుంటారు.. లేదా ఆర్గనైజర్‌లో రికార్డ్ చేసుకుంటారు.. కదా..భవిష్యత్తులో మీకా జంఝాటం అవసరం లేదు… మీ ఫ్రెండ్ చెబుతుండగానే ఇంటర్నెట్ ఆధారిత సాధనం స్పందించి.. ఆటోమేటిక్‌గా ఆ కార్యక్రమాన్ని షెడ్యూల్ చేస్తుంది. సకాలంలో మీకు దాని గురించి గుర్తుచేస్తుంది. భవిష్యత్తులో మొబైల్ఫోన్లో వాడే యాప్‌ల సంఖ్య తగ్గిపోతుంది. స్మార్ట్ కళ్లద్దాలు, వాచీలు, ఉంగరాలు వంటి వాటిల్లోకి ఏఐని చొప్పించి, రోజువారీ సాంకేతిక అవసరాలను తీర్చుకోవచ్చు.
అమెజాన్‌కు చెందిన కొత్త జనరేటివ్ ఏఐ ఆధారిత అలెక్సా+.. ఈ దిశగా ఒక ముందడుగుగా చెప్పొచ్చు. దీనికి మనం వేర్వేరు కమాండ్లు ఇవ్వాల్సిన పనిలేదు. సుదీర్ఘమైన ఒక సహజ సిద్ధ ధ్వని కమాండ్ ఇస్తే చాలు. దాన్ని అలెక్సా+ ప్రాసెస్ చేసుకొని.. మానవుల తరహాలోనే స్పందిస్తుంది. వచ్చే రెండేళ్లలో ఇలాంటి అనేక పరిజ్ఞానాలు అందుబాటులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవుల తరహాలో నిరంతరాయంగా గ్యాడ్జెట్లతో సంభాషణలు సాగించడానికి వీలవుతుందని పేర్కొంటున్నారు.
యాంబియెంట్ కంప్యూటింగ్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చాక.. టెక్నాలజీతో మనం జరిపే చర్యలు.. నిర్దిష్ట అవసరం కోసం ఉద్దేశించినవిగా ఉండవు. ఎక్కువ ఆటోమేటెడ్‌గా ఉంటాయి. ఇప్పటికే అలెక్సా తదితరాలకు చెందిన స్పీకర్లలో యాంబియెంట్ కంప్యూటింగ్ సూచికలు కనిపించాయి. ఇలాంటి స్పీకర్లు.. మనం భోజనం చేసే సమయం ఆధారంగా పాటల ప్లేలిస్ట్‌ను సిద్ధం చేస్తుంటాయి. మనం ఇంటికి ఎంత దగ్గరగా ఉన్నామన్నదాని ఆధారంగా గీజర్లను ఆన్ చేసే స్విచ్‌లు, లైట్లను ఆన్, ఆఫ్ చేసే వ్యవస్థలు, సోఫా ఎదుటే భారీ స్క్రీన్ థియేటర్ అనుభూతిని కలిగించే యాపిల్ విజన్ప్రో వంటి మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్లు కూడా యాంబియెంట్ కంప్యూటింగ్ దిశగా వేస్తున్న బుడిబుడి అడుగులే. ఇవి స్వరాన్ని గుర్తించడం, కదలికలు, సైగలను గమనించడం, వేరబుల్ టెక్నాలజీ తదితరాల ఆధారంగా పనిచేస్తాయి.






