Al Qaeda : ట్రంప్ సహా అమెరికా నేతలను హతమారుస్తాం : అల్‌ఖైదా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సహా ఆయన కార్యవర్గంలోని మంత్రులను, శ్వేతసౌధం సిబ్బందిని హతమారుస్తామంటూ ఉగ్ర సంస్థ ఆల్‌ఖైదా (Al-Qaeda) అరేబియన్ పెనిన్సులా ( ఏక్యూపీఏ) సంచలన హెచ్చరిక జారీ చేసింది. ఆ సంస్థ నాయకుడు సాద్‌బిన్ అతేఫ్ అల్-అవ్లాకీ ఈ మేరకు తాజాగా దాదాపు 30 నిమిషాల నిడివి ఉన్న ఓ వీడియోను విడుదల చేశాడు. ట్రంప్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance), విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio), రక్షణ మంత్రి పీట్ హేగ్సేత్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) సహా శ్వేతసౌధంతో సన్నిహిత సంబంధాలున్న ప్రతిఒక్క అధికారిని, నాయకుడిని, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. గాజాలో పాలస్తీనావాసుల మనుగడకు వారు ఎటువంటి ఆధారం మిగల్చలేదని, అందుకే వారిని హతమారుస్తామని పేర్కొన్నాడు. ఆల్ అవ్లాకీపై అమెరికా గతంలోనే 6 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించిన సంగతి గమనార్హం.







