Russia: రష్యాకు ఏమైంది..? వరుస భూకంపాలతో వణుకుతున్న రష్యన్లు…

Kamchatka: అటు భూకంపాలు.. ఇటు బద్ధలవుతున్న అగ్ని పర్వతాలు.. రష్యాను వణికిస్తున్నాయి. వరుసగా సంభవిస్తున్న తీవ్ర ప్రకంపనలు.. ఆదేశాన్ని విధ్వంసం చేస్తున్నాయి. మొన్నటి భూకంపం మర్చిపోకముందే… కురిల్ దీవులలో భూకంపం (Russia Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రత నమోదైంది. జపాన్ వాతావరణ శాఖ, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ ఈ విషయాన్ని వెల్లడించాయి. రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ పలు ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం ధాటికి పలు నగరాల్లోని భవనాలు ఊగిపోయాయని రష్యా మీడియా తెలిపింది. ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు.
ఇటీవల రష్యా తీరంలో భారీ భూకంపం (Kamchatka Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రత నమోదైంది. ఈ భారీ భూప్రకంపనల ధాటికి రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీర ప్రాంతాలను సునామీ (Tsunami) తాకింది. పసిఫిక్ ప్రాంతంలో 2011 తర్వాత ఇదే అత్యంత భారీ భూకంపమని నిపుణులు పేర్కొన్నారు. దాని ప్రభావంతోనే తాజాగా భూకంపం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బద్దలైన అగ్నిపర్వతం..
రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలోని క్రాషెన్నినికోవ్ అగ్నిపర్వతం శనివారం అర్ధరాత్రి బద్దలైనట్లు (Volcano Eruption) స్థానిక మీడియా తెలిపింది. ఇటీవల సంభవించిన భారీ భూకంపం వల్ల దాదాపు 600 ఏళ్ల తర్వాత మొదటిసారి ఈ అగ్నిపర్వతం బద్దలైనట్లు రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో 6 వేల మీటర్ల ఎత్తుకు బూడిద ఎగసిపడినట్లు వెల్లడించింది. మరో ఘటనలో కమ్చట్కా ద్వీపకల్పంలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతం క్ల్యూచెస్కీ బద్దలైంది.