హైదరాబాద్లో 6.60 లక్షల మందికి కరోనా?
కేసుల వ్యాప్తిలో అంతకంతకూ అన్నట్టు పెరగడమే తప్ప తగ్గడం లేదన్నట్టుగా ఉన్న తెలంగాణపై మరో పిడుగు పడింది. ఈ పిడుగు అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ నుంచి పడింది కావడంతో అది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం రోజుకు 2వేల లోపు కేసులతో తెలంగాణ లక్ష కేసుల దిశగా దూసుకెళుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ( సిసిఎంబి) శాస్త్రవేత్తలు హైదరాబాద్ నగరంలో పరిశోధనలు నిర్వహించారు. మురుగునీటి పై వీరు నిర్వహించిన పరిశోధనలో హైదరాబాద్ వాసులను వణికించే విషయం వెలుగు చూసింది. దీని ప్రకారం… గత 35 రోజులలో నగరంలో కరోనా అతి తీవ్రంగా వ్యాప్తి చెందింది. ఆ సమయంలోనే దాదాపుగా 6 లక్షళ 60వేల మందికి ఇప్పటికే కరోనా సోకిందని పరిశోధకులు అంచనా వేశారు. ఈ వైరస్ సోకిన వారి మలమూత్రాలలో వైరస్ ఆనవాళ్లు కనీసం 35 రోజుల పాటు ఉంటాయని అంటున్న సిసిఎంబి శాస్త్రవేత్తలు… మురుగునీటిపై చేసిన పరిశోధన ద్వారా నగరంలో కరోనా కేసుల వ్యాప్తిని అంచనా వేశారు. ఇంటా బయటా విమర్శలతో ఇటీవలే పరీక్షల సంఖ్య బాగా పెంచినట్టు చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం… తాజా పరిశోధన ఫలితాల వెల్లడి నేపధ్యంలో మరింత విమర్శలకు గురయ్యే ప్రమాదం కనిపిస్తోంది.






