మోదీ ఇమేజ్ పెరిగింది : న్యూయార్క్ టైమ్స్
కరోనా వైరస్ భారత్లో ప్రవేశించడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ అనేక సమస్యలను ఎదుర్కొన్నారనీ, కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయడానికి తీసుకుంటున్న చర్యలు, శ్రద్ధాసక్తులతో ఆయన ఇమేజ్ పెరిగిందని న్యూయార్క్ టైమ్స్ వ్యాఖ్యానించింది. కరోనాకి ముందు సీఏఏకి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలోనూ, దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు మోదీ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీశాయని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన జరిపిన సమయంలోనే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయని మోదీ ప్రతిష్ట దిగజారిన సమయంలో కోవిడ్ 19 ప్రవేశించడం, దానిని అరికట్టేందుకు మోదీ దృష్టి సారించడంతో ఒక్కసారిగా మోదీ పాపులారిటీ పెరిగిందని అన్నారు.
కరోనా కట్టడి కోసం మోదీ తీసుకుంటున్న చర్యల కారణంగానే ఇతర దేశాల్లో కన్నా భారత్లో మరణాలు తక్కువగా ఉన్నాయని ఆ పత్రిక తాజా సంపాదకీయంలో పేర్కొంది. క్లిష్ట సమయంలో పాలనా యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపించడంలో మోదీ విజయం సాధించారనీ, గత వారం మోదీ ప్రకటించిన 260 బిలియన్ డాలర్ల ప్యాకేజీతో ఉపాధి అవకాశాలు పెరగవచ్చని, ముఖ్యంగా వలస కార్మికుల విషయంలో మోదీ తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొంది. మోదీ నిర్ణయాత్మక విధానాలను తీసుకుంటున్నారనీ, ప్రత్యర్థులను చిత్తు చేయడంలో ముందుంటున్నారని ఆ పత్రిక వివరించింది.






