50 లక్షలు దాటిన కరోనా రికవరీలు
దేశంలో కరోనా కేసులు ప్రతిరోజు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నప్పటికీ, అంతకంటే ఎక్కువగా బాధితులు కోలుకుంటున్నారు. ఇప్పటివరకు కరోనా బారినపడినవారిలో 50 లక్షలకు పైగా బాధితులు కోలుకున్నారు. గత 11 రోజుల్లో 10 లక్షల మంది కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 74,893 మంది కోలుకున్నారని వెల్లడించింది. దీంతో కరోనాను జయించిన వారి సంఖ్య 50,16,520కి చేరిందని తెలిపింది. దేశంలో గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ పెద్దమొత్తంలో అంటే 90వేలకు పైగా బాధితులు మహమ్మారి బారినుంచి బయటపడుతున్నారని పేర్కొంది.






