దేశ జనాభాలో సగం మందికి కరోనా!
ఫిబ్రవరికల్లా దేశ జనాభాలో సగం మందికి కరోనా సోకే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ అంచనా వేసింది. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఒక్కో నెలలో 26 లక్షల కేసులు (రోజుకు 86 వేల కేసులు) నమోదయ్యే దుస్థితి దాపురిస్తుందని హెచ్చరించింది. ఇప్పటివరకు దేశంలో దాదాపు 30 శాతం మందికి వైరస్ సోకింది. మరో నాలుగు నెలల్లో ఇది 50 శాతం జనాభాకు ప్రబలే అవకాశాలు ఉన్నాయి అని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగ్రవాల్ తెలిపారు. కరోనా వ్యాప్తిపై అంచనాల రూపకల్పనకు కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. భారీ జనాభాకు అనుగుణంగా తగిన సంఖ్యలో శాంపిళ్లను సేకరించి పరీక్షించకపోవడంతో, జాతీయ సీరోలాజికల్ సర్వేలో సెప్టెంబరు నాటికి దేశంలో 14 శాతం మందికే ఇన్పెక్షన్ సోకిందనే ఫలితం వచ్చిందన్నారు. దసరా, దీపావళి పండుగల వేళ భౌతిక దూరం, మాస్క్ ధారణ, శానిటైజేషన్లకు ప్రజలు తిలోదకాలిస్తే కేసుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు.






