టాంటెక్స్ పూర్వ అధ్యక్షుల ముచ్చట్లు…ఘనంగా ఫాదర్స్ డే

ఉత్తర టెక్సెస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఫాదర్స్ డే సందర్భంగా టాంటెక్స్ తో మీ అనుబంధం మరియు జీవిత అనుభవాలు అంశం మీద సంస్థ మొదటి నుండి పని చేసిన అధ్యక్షులందరితో అత్మీయంగా ముచ్చటిస్తూ రెండు గంటల సేపు సరదాగా జరిగింది. కోవిడ్ కారణంగా ఈ కార్యక్రమాన్ని జూమ్‍లో జరుపుకున్నారు. ముందుగా ప్రస్తుత అధ్యక్షులు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి గారు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆన్‍లైన్‍లో విచ్చేసిన పూర్వ అధ్యక్షులకు స్వాగతం పలికారు. ఫాధర్స్ డే సందర్భంగా వారి నాన్నగారిని తలుచుకుంటూ తన అనుభవాలను, జ్ఞాపకాలను సభతో పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి శ్రీనివాసులు బసాబత్తినను సాదరంగా ఆహ్వానించారు.
శ్రీనివాసులు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు నమస్కారాలు తెలుపుకుంటూ సభకు విచ్చేసిన పూర్వాధ్యక్షులు ఆనంద మూర్తి కూచిభొట్ల, జనార్ధన రావు, రాం ఎలమంచిలి, సుభాష్ చలసాని, మూర్తి ములుకుంట్ల, రాజా రెడ్డి, డా.శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, చంద్ర శేఖర్ కన్నెగంటి, సురేష్ మండువ, డా.నరసింహా రెడ్డి ఉరిమిండి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డను సాదరంగా ఆహ్వానించారు. వారు సంస్థకు అధ్యక్షులుగా పని చేసిన సంవత్సరం తెలుపుతూ వారి గురించి కొన్ని మాటలు చెప్తూ వారి కృషిని మరొక్కసారి గుర్తు చేసారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం స్థాపించిన శ్రీరామకృష్ణ నూనెకు ధన్యవాదాలు తెలుపుతూ వారిని సాదరంగా సభకు ఆహ్వానించారు. రామకృష్ణ అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ తమ జ్ఞాపకాలను సభలో పంచుకున్నారు. పూర్వాధ్యక్షులు అందరూ వంతుల వారీగా తమ తండ్రి గురించి, సంస్థ గురించి తమ విలువైన జ్ఞాపకాలను సభలో ముచ్చటిస్తూ అందరినీ ఉద్వేగానికి గురి చేసారు. ఇంత చక్కటి జీవితాన్ని అందించిన తల్లితండ్రులకు ఎంతో రుణపడి ఉన్నామని వారిని మరొక్కసారి గుర్తు చేసుకుని అంజలి ఘటించారు. ఫాదర్స్ డేని ఇంతకు మునుపు ఎన్నడూ జరపని విధంగా ఘనంగా చేసారని ప్రస్తుత అధ్యక్షులు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటిని అభినందించారు.
సభకు విచ్చేసిన పూర్వాధ్యక్షులు అందరికీన మరొక్కసారి నమస్కారాలు తెలుపుతూ శ్రీమతి లక్ష్మి అన్న పూర్ణ పాలేటి తమ తండ్రి గారి జ్ఞాపకాలను పంచుకున్నారు. తమ తండ్రిగారి నుండి క్రమశిక్షణ మరెన్నో మంచి అలవాట్లు నేర్చుకున్నామని తెలిపారు. పాలక మండలి ఉపాధిపతి వెంకట్ ములుకుట్ల సభకు నమస్కారాలు తెలిపారు. సరదాగా సాగుతున్న కార్యక్రమానికి ముగింపు పలకవలసిందిగా ప్రత్యేక సభలను నిర్వహించే శ్రీమతి సరితా రెడ్డి ఈదరను ఆహ్వానించారు. వారు అందరికీ పేరు, పేరునా ధన్యవాదాలు తెలుపుతూ తండ్రితో వారి జ్ఞాపకాలను పంచుకున్నారు.