KTR: కేటీఆర్ అరెస్ట్ ఖాయమా..?

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో (Formula E car rase case) బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అరెస్టు కావడం ఖాయమనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ కార్ రేసుపై ఏసీబీ (ACB) 8 నెలలపాటు విచారణ జరిపింది. ఇందులో కేటీఆర్‌తో పాటు పలువురు అధికారులపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. దీనిపై తాజాగా ఏసీబీ, ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇందులో కేటీఆర్ క్విడ్ ప్రో కోకు (quid pro quo) పాల్పడినట్లు ఆరోపించింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఏసీబీకి ప్రాసిక్యూషన్‌ను కొనసాగించి చర్యలు తీసుకునే అధికారం ఇవ్వడం, గవర్నర్ అనుమతి తర్వాత ఛార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉండటంతో కేటీఆర్ అరెస్టు ఖాయమనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-కార్ రేసు నిర్వహణ కోసం హెచ్‌ఎండీఏ ద్వారా ఫార్ములా ఈ ఆర్గనైజర్స్ (FOE)కి రూ. 55 కోట్లు బదిలీ చేసింది అప్పటి ప్రభుత్వం. అయితే బ్రిటిష్ పౌండ్లలో ఈ నగదు బదిలీ చేయడం చట్టవిరుద్ధం. ఇది ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపైన ఆర్‌బీఐ తెలంగాణ ప్రభుత్వంపై రూ. 8 కోట్ల జరిమానా విధించింది. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించింది. ఈ జరిమానాపై విచారణ జరిపినప్పుడు, ఫార్ములా ఈ రేసు సంబంధించిన ఆర్థిక అక్రమాలు, విధాన ఉల్లంఘనలు బయటపడ్డాయి.
ఏసీబీ నివేదిక ప్రకారం.. ఫార్ములా ఈ రేసు కోసం మొదట ఏస్ నెక్స్ట్‌జెన్ అనే కంపెనీ ఒప్పందం చేసుకుంది. అయితే, మొదటి సీజన్‌లో భారీ నష్టాలు చవిచూసిన ఈ సంస్థ, మూడేళ్లపాటు రూ. 500 కోట్ల ఆర్థిక భారాన్ని భరించలేక ఒప్పందం నుంచి తప్పుకుంది. ఈ సమయంలో కేటీఆర్, ఏస్ నెక్స్ట్‌జెన్‌ను తప్పించి, హెచ్‌ఎండీఏ ద్వారా రేసు నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం తీసుకునేలా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా రూ. 45 కోట్లు ఎఫ్‌ఓఈకి బదిలీ చేశారు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా జరిగినట్లు ఏసీబీ తన నివేదికలో పేర్కొంది. అదే సమయంలో ఏస్ నెక్స్ట్‌జెన్ నుంచి బీఆర్ఎస్‌కు రూ. 45 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్యలు క్విడ్ ప్రో కోనే అని ఏసీబీ ఆరోపించింది.
2024 డిసెంబర్ 19న కేటీఆర్‌పై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడంతో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. 2025 జనవరిలో కేటీఆర్‌ను ఏసీబీ ప్రశ్నించింది. ఆయన ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇదొక లొట్టపీస్ కేసు అని, ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పారు. రూ. 46 కోట్లు నేరుగా ఎఫ్‌ఓఈ ఖాతాలో జమ చేయబడ్డాయని కేటీఆర్ వాదించారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తూ, లై-డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమని ప్రకటించారు.
ఏసీబీ తాజా నివేదికలో కేటీఆర్‌పై క్విడ్ ప్రో కోకు ఆరోపణలను బలపరిచే ఆధారాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ నివేదికను ప్రభుత్వం ఆమోదించడంతో, గవర్నర్ అనుమతి తర్వాత ఛార్జ్‌షీట్ దాఖలు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ 90 రోజుల వరకు తీసుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, కేటీఆర్ అరెస్టు రాజకీయ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.